సర్జికల్ స్ట్రైక్ వీడియోలు ఇచ్చేసిన ఆర్మీ: ఇక మోడీ ఇష్టం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో జరిపిన సర్జికల్ స్ట్రైక్ దాడుల వీడియోను భారత ఆర్మీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పుడు ఆర్మీ సమర్పించిన వీడియో ఫుటేజీ విడుదలపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.
గత రెండు రోజులుగా భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ దాడుల విషయంలో వివాదం రగులుతున్నది. ఇదే సందర్బంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకులు, కాశ్మీర్ కు చెందిన కొందరు నాయకులు సర్జికల్ స్ట్రైక్ దాడుల వీడియోను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అసక్తి నెలకొంది. సర్జికల్ స్ట్రైక్ దాడుల వీడియోను విడుదల చేసి నిజాయితీ నిరూపించుకోవాలని పాకిస్థాన్ సైతం సవాలు విసిరింది.

దాడులకు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. ఇదే సందర్బంలో సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన వీడియో ఫుటేజీలు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వానికి ఆ వీడియో ఫుటేజీలు అంధించాయి.
బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినేట్ భేటీ జరిగింది. రెండు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సరిహద్దు ప్రాంతాల్లోని రక్షణ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారని తెలిసింది. ఆర్మీ సమర్పించిన వీడియో విడుదల చెయ్యాలా ? వద్దా ? అని కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications