ప్రపంచ దేశాలకు తెలుగు రాష్ట్రాల పవర్ చూపించిన ప్రధాని మోదీ!
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన రెండు దేశాల (ఫ్రాన్స్, స్లోవేకియా) పర్యటనను విజయవంతంగా ముగించుకుని శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ పర్యటన కేవలం ఉన్నత స్థాయి దౌత్య చర్చలకే పరిమితం కాకుండా, భారతీయ హస్తకళల విశిష్టతను, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా సాగింది. మన దేశ చరిత్ర, ప్రాంతీయ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న అరుదైన కళాఖండాలను ఆయా దేశాల అధినేతలకు బహుమతులుగా ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ 'సాంస్కృతిక దౌత్యాన్ని' (Cultural Diplomacy) అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించారు. అంతర్జాతీయ బంధాలను మరింత బలోపేతం చేసేలా ప్రధాని అందించిన ఆ అద్భుతమైన కానుకల విశిష్టతలు తెలుసుకుందాం..
ఫ్రెంచ్ అధ్యక్షుడికి 'కలంకారీ మహాభారతం' పెయింటింగ్!
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హస్తకళా నైపుణ్యంతో కూడిన 'కలంకారీ మహాభారతం పెయింటింగ్'ను బహుమతిగా ఇచ్చారు. సాంప్రదాయ పెన్-డ్రాయింగ్ పద్ధతిలో, దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. కర్తవ్యం, న్యాయం, ధైర్యం వంటి నైతిక విలువలను ప్రతిబింబించే మహాభారత ఘట్టాలతో పాటు.. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధిస్తున్న దృశ్యం ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శాంతి, మానవ గౌరవం, నైతిక నాయకత్వం వంటి సార్వత్రిక విలువలను ఈ పెయింటింగ్ చాటిచెబుతుంది.

అలాగే మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్‌కు తెలంగాణకు చెందిన ప్రసిద్ధ 'పోచంపల్లి సిల్క్ స్టోల్'ను (మగలి/దుపట్టా) అందజేశారు. సాంప్రదాయ 'ఇకత్' డైయింగ్ పద్ధతిలో జ్యామితీయ, పూల డిజైన్లతో నేసిన ఈ సిల్క్ స్టోల్.. ఫ్యాషన్, కళలను అమితంగా ఇష్టపడే ఫ్రాన్స్ సంస్కృతిని విశేషంగా ఆకట్టుకుంది.
స్లోవేకియా ప్రధానికి 'కాశ్మీరీ సిల్క్ కార్పెట్'.. అధ్యక్షుడికి 'హిమ్రూ' టై!
స్లోవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికోకు ప్రధాని మోదీ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'కాశ్మీరీ సిల్క్ కార్పెట్'ను కానుకగా ఇచ్చారు. శ్రీనగర్ ప్రాంతానికి చెందిన నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు సహజమైన పట్టుతో, ఎంతో శ్రమించి నెలల తరబడి నేసిన ఈ కార్పెట్ విలాసవంతమైన కళాఖండంగా గుర్తింపు పొందింది.
ఇక స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినికి ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీనగర్) సంప్రదాయ 'హిమ్రూ సిల్క్ టై - పాకెట్ స్క్వేర్' సెట్‌ను అందించారు. భౌగోళిక గుర్తింపు (GI Tag) పొందిన ఈ వస్త్రం దాని అద్భుతమైన పూల డిజైన్లతో రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. దీనితో పాటు ప్రతాప్‌గఢ్‌కు చెందిన పురాతన 'థేవా' (Thewa) జ్యువెలరీ కళతో బంగారు రేకులను రంగుల గాజుపై అమర్చి రూపొందించిన అరుదైన కఫ్ లింక్స్ (Cufflinks) ను కూడా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చారు.
స్పీకర్‌కు ఆయుర్వేద గ్రంథాలు.. బిహార్ స్పెషల్ 'థెకువా'!
స్లోవేకియా పార్లమెంట్ స్పీకర్ రిచర్డ్ రాసికి భారతీయ వైద్య విజ్ఞానానికి ప్రతీకలైన 'చరక సంహిత', 'సుశ్రుత సంహిత' గ్రంథాలను ప్రధాని మోదీ అందజేశారు. మానవ శరీర ధర్మశాస్త్రం, ఆరోగ్యంపై రెండు వేల ఏళ్ల నాటి శాస్త్రీయ అవగాహనకు చరక సంహిత నిదర్శనంగా నిలిస్తే.. ప్రాచీన ప్లాస్టిక్ సర్జరీ (రైనోప్లాస్టీ) మరియు శస్త్రచికిత్స పరికరాల విజ్ఞానాన్ని వివరించే తొలి గ్రంథంగా సుశ్రుత సంహిత ప్రపంచ వైద్య చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
వైద్య గ్రంథాలతో పాటు స్పీకర్ రిచర్డ్ రాసికి బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పండగలలో (ముఖ్యంగా ఛఠ్ పూజలో) ఎంతో పవిత్రంగా తయారుచేసే సాంప్రదాయ తీపి వంటకం 'థెకువా'ను (Thekua) కూడా ప్రధాని మోదీ రుచి చూపించారు. గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో చేసే ఈ వంటకం భారతీయ గ్రామీణ పండగ సంస్కృతిని, సుదీర్ఘ కాలం నిల్వ ఉండే భారతీయ ఆహార వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తానికి ప్రధాని మోదీ తన పర్యటన ద్వారా భారతీయ సంస్కృతిని, కళలను ప్రపంచ దేశాల అధినేతలకు పరిచయం చేస్తూ సాగించిన ఈ 'గిఫ్ట్ డిప్లొమసీ' అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను మరింత పెంచింది.














Click it and Unblock the Notifications