రైళ్లలో రాత్రిపూట మొబైల్ ఛార్జింగ్ బంద్.. ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ షాక్
రైలు ప్రయాణం చేసే లక్షలాది మంది ప్రయాణికులకు రైల్వే శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. రాత్రివేళల్లో రైళ్లలో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెట్టే అలవాటు ఉన్నవారికి ఇకపై ఆ సౌకర్యం అందుబాటులో ఉండదు. ప్రయాణికుల భద్రతనే పరమావధిగా భావించిన రైల్వే బోర్డు, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని అన్ని రైల్వే జోన్లకు కఠిన ఆదేశాలు ఇచ్చింది.
తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నడిచే ఒక రైలులో ఛార్జింగ్ పెట్టిన ఒక పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బోగీ అంతా దట్టమైన పొగలు అలుముకుని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఈ తరహా నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని గ్రహించిన రైల్వే యాజమాన్యం తక్షణమే చర్యలకు పూనుకుంది. గతంలోనే ఈ నిబంధన ఉన్నప్పటికీ, సిబ్బంది అలసత్వం వల్ల సరిగ్గా అమలు కావడం లేదని గుర్తించి, ఇకపై ఎలాంటి మినహాయింపులు లేకుండా రాత్రివేళల్లో విద్యుత్ సరఫరాను కట్ చేయాలని స్పష్టం చేసింది.

రాత్రి ఛార్జింగ్‌తోనే అసలు ముప్పు.. సైలెంట్ కిల్లర్‌గా లిథియం బ్యాటరీలు!
ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లు, పవర్ బ్యాంకులలో లిథియం-అయాన్ బ్యాటరీలను వినియోగిస్తారు. ఛార్జింగ్ అవుతున్న సమయంలో ఇవి అధికంగా వేడెక్కుతాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణికులు నిద్రపోతున్న సమయంలో ఫోన్లను లేదా పవర్ బ్యాంకులను దిండ్లు, బెడ్షీట్లు లేదా బ్యాగుల కింద ఉంచి ఛార్జింగ్ పెడుతుంటారు. దీనివల్ల వేడి బయటకు పోక బ్యాటరీలు త్వరగా వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది. పగటిపూట ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది కానీ, అందరూ నిద్రపోయే రాత్రి వేళల్లో చిన్న నిప్పురవ్వ వచ్చినా పెద్ద ప్రమాదంగా మారే ముప్పు ఉందనే ఉద్దేశంతోనే ఈ 6 గంటల ఛార్జింగ్ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు.
సర్ప్రైజ్ తనిఖీలు.. సిబ్బందిపై కఠిన చర్యలు!
రాత్రి 11 గంటలు కాగానే నియమాకం ప్రకారం ఛార్జింగ్ స్విచ్‌లను నిలిపివేస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి రైల్వే ఉన్నతాధికారులు, సూపర్వైజర్లు సర్ప్రైజ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత రైల్వే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది. 2014లోనే బెంగళూరు-హజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత ఈ నిబంధనను తీసుకువచ్చినప్పటికీ, ఇటీవల జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో దీనిని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
రైలు ప్రయాణానికి బయలుదేరే ముందే మొబైల్స్, పవర్ బ్యాంకులు, ల్యాప్‌టాప్‌లను పూర్తి స్థాయిలో ఛార్జ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. పగటి పూట కూడా ఛార్జింగ్ పెట్టే సమయంలో డ్యామేజ్ అయిన కేబుల్స్ లేదా ఒరిజినల్ కాని ఛార్జర్లను వాడకూడదని స్పష్టం చేశారు. ఫోన్ లేదా పవర్ బ్యాంక్ విపరీతంగా వేడెక్కినా, ఉబ్బినట్లు అనిపించినా వెంటనే ఛార్జింగ్ తీసివేయాలి. మన చిన్న నిర్లక్ష్యం తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదంటే రైల్వే భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిందే!














Click it and Unblock the Notifications
