రైలు ప్రయాణానికి ప్రింటెడ్ టికెట్ అవసరమా?- రైల్వే శాఖ క్లారిటీ
ప్రయాణ సమయంలో అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్లకు సంబంధించిన ప్రింటెడ్ కాపీలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందంటూ వస్తోన్న వార్తలపై రైల్వే శాఖ స్పందించింది. అటువంటి నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. టికెటింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయని వస్తున్న మీడియా నివేదికలు తప్పుదోవ పట్టించేవని స్పష్టం చేసింది. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ కూడా నిరాధారమైనవని పేర్కొంది.
ఇప్పటికే ఉన్న నిబంధనల మేరకు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసినా ప్రింటవుట్ తీసుకుంటే ప్రయాణికులు వాటిని తమ వెంట ఉంచుకోవాలి. డిజిటల్‌గా బుక్ చేసుకుని ప్రింట్ తీసుకోని వారు మాత్రం బుకింగ్ కోసం వాడిన మొబైల్ నుంచే టికెట్‌ను తనిఖీకి చూపించవచ్చు. ఈ విషయంలో ఎలాంటి కొత్త ఆదేశాలు లేవని రైల్వే శాఖ పేర్కొంది. రిజర్వేషన్ లేని రైలు టిక్కెట్లకు ప్రింటెడ్ కాపీ తప్పనిసరి కాదని వివరణ ఇచ్చింది.

డిజిటల్, రిజర్వేషన్ లేని అన్ని టిక్కెట్లకు హార్డ్ కాపీలు అవసరమంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించినంత వరకు రైల్వేలు ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదని, రిజర్వేషన్ లేని టిక్కెట్లతో ప్రయాణించే పాత విధానం అమల్లో ఉందని, ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న నిబంధనలను మాత్రమే పాటించాలని పునరుద్ఘాటించింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన డిజిటల్ అన్ రిజర్వుడ్ టిక్కెట్లకు ప్రింటవుట్ అవసరం లేదు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లోనే టిక్కెట్‌ను చూపవచ్చు.
ఈ వివరణ- రోజువారీ/ స్వల్ప దూర ప్రయాణికులు, ప్రత్యేకించి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తరచుగా టిక్కెట్లు తీసుకునే వారికి ఉపశమనం కలిగించినట్టయింది. అనవసర గందరగోళాన్ని నివారించడానికి- అధికారిక నోటిఫికేషన్లు, ధృవీకరించిన సమాచారంపై మాత్రమే ఆధారపడాలని రైల్వేలు ప్రయాణికులకు సూచించాయి. ఈ ప్రకటనతో అన్ని ఊహాగానాలకు రైల్వే శాఖ తెరదించింది. రిజర్వేషన్ లేని ప్రయాణానికి ప్రస్తుత ధృవీకరణ నిబంధనలను కొనసాగుతుందని వివరించింది.












Click it and Unblock the Notifications