Kavach 4.0: 160 కిమీ స్పీడ్‌లో దూసుకొచ్చిన రైలు.. రెడ్ సిగ్నల్ పడగానే
భారతీయ రైల్వే రంగంలో ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా అడ్డుకునే స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్ 'కవచ్ 4.0' (KAVACH Version 4.0) సరికొత్త వెర్షన్ పరీక్షలు అత్యంత విజయవంతమయ్యాయి. ఉత్తరప్రదేశ్ పరిధిలోని నార్త్ సెంట్రల్ రైల్వే లైన్‌లో, చిపియానా బుజుర్గ్ నుంచి టుండ్లా మధ్య గల 175 కిలోమీటర్ల అత్యంత కీలకమైన సెక్షన్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
ప్రతిష్టాత్మక కాన్పూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గంటకు 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తున్న సమయంలోనూ ఈ వ్యవస్థ అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.

రెడ్ సిగ్నల్ పడగానే దానంతట అదే పడిన బ్రేకులు!
హైస్పీడ్ తో వెళ్తున్న రైలు సురక్షితంగా ఆగడంపై నిర్వహించిన ఈ పరీక్షలో 'కవచ్ 4.0' సాంకేతికత అద్భుత విజయాన్ని అందుకుంది. రైలు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తున్న సమయంలో ట్రాక్‌పై రెడ్ సిగ్నల్ పడగా.. లోకోపైలట్ ప్రమేయం లేకుండానే కవచ్ వ్యవస్థ ఆటోమేటిక్ గా స్పందించింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి వేగాన్ని నియంత్రిస్తూ, రైలుకు బ్రేకులు వేసి సురక్షితంగా ఆపింది. పొగమంచు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో లోకోపైలట్ పొరపాటున సిగ్నల్‌ను గమనించని సందర్భాల్లో ఈ వ్యవస్థ ప్రాణనష్టాన్ని, రైలు ప్రమాదాలను వంద శాతం నివారిస్తుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 160 కి.మీ వేగంతో పనిచేసే దేశంలోనే మొట్టమొదటి రూట్‌గా ఇది గుర్తింపు పొందింది.
🚉 Another milestone in strengthening rail safety!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2026
Successful commissioning of KAVACH Version 4.0 on the Chipayana Buzurg–Tundla section. pic.twitter.com/46iBqGfZnt
'కర్నెక్స్' ఆధ్వర్యంలో హై-స్పీడ్ సాంకేతికత
ఈ సరికొత్త కవచ్ వ్యవస్థను 'కర్నెక్స్' (Kernex) సంస్థ రూపొందించింది. ఇంతటి హై-స్పీడ్ ఆపరేషన్ల నిర్వహణ కోసం 160 కి.మీ వేగంతో పనిచేసే అధికారిక అనుమతి పొందిన మొదటి సంస్థగా ఇది నిలిచింది. ఇంజనీరింగ్ పరంగా ఎంతో సంక్లిష్టమైన ఈ విభాగంలో తాజా విజయంతో నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలో కవచ్ నెట్‌వర్క్ సామర్థ్యం ఏకంగా 445 కిలోమీటర్లకు పెరిగింది.
పక్కాగా సాంకేతిక ఏర్పాట్లు
ఈ 175 కిలోమీటర్ల మేర వ్యవస్థను పటిష్టం చేసేందుకు రైల్వే శాఖ అత్యాధునిక మౌలిక వసతులను కల్పించింది:
- స్టేషనరీ యూనిట్లు: నిరంతర నిఘా కోసం మార్గమధ్యంలో 22 స్టేషనరీ యూనిట్లను ఏర్పాటు చేశారు.
- లెవల్ క్రాసింగ్స్: భద్రతను పెంచుతూ 9 లెవల్ క్రాసింగ్ యూనిట్లను అమర్చారు.
- లోకోమోటివ్స్: మొత్తం పది శక్తివంతమైన WAP-7 లోకోమోటివ్ (ఇంజిన్)లలో ఈ సాంకేతికతను అనుసంధానించారు.
- ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగ్‌లు: రైలు వేగం, లొకేషన్‌ను గుర్తించేందుకు ప్రతి కిలోమీటరుకు ట్రాక్‌పై ఆర్‌ఎఫ్‌ఐడి (RFID) ట్యాగ్‌లను అమర్చారు. ఇవి ఇంజిన్‌లోని పరికరాలతో నిరంతరం సంభాషిస్తూ ఉంటాయి.
- టెలికాం టవర్లు - విస్తృతమైన ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఈ వ్యవస్థకు వెన్నుముకలా పనిచేస్తున్నాయి.
వేగవంతం కానున్న ఢిల్లీ-హౌరా కారిడార్ ఆధునీకరణ
రైల్వే శాఖ అధికారిక ప్రకటన ప్రకారం.. చిపియానా బుజుర్గ్ నుంచి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ (DDU) జంక్షన్ వరకు పనులు ఇప్పటికే వేగంగా పూర్తవుతున్నాయి. మొత్తం 751 కిలోమీటర్ల సుదీర్ఘ మార్గంలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ-హౌరా కారిడార్‌లో రైళ్లు గంటకు 160 కి.మీ వేగంతో పూర్తి సురక్షితంగా ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది. కవచ్ 4.0 విజయవంతం కావడం భారతీయ రైల్వే వ్యవస్థ ఆధునీకరణలో మరియు ప్రయాణికుల భద్రతలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికిందని నిపుణులు అభివర్ణిస్తున్నారు.














Click it and Unblock the Notifications