సొంతింటి కలలు సాకారం చేసుకోవాలనే హైదరాబాదీలకు మరో ఛాన్స్
హైదరాబాద్ క్యూర్ పరిధిలోని సొంతిల్లు లేని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మొదట ఆగస్ట్ 10వ తేదీ సాయంత్రం వరకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ కు అప్పటివరకు దరఖాస్తులు
ఆగస్టు 15వ తేదీ శనివారం వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. పేదల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చి, నామమాత్రపు ధరలోనే సొంత ఇంటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు.

గడువు పొడిగించాలని కోరిన ప్రజలు
అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పైన ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే రెండో శనివారం, బోనాల పండుగ తదితర వరుస సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా గడువు పొడిగించాలంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు.
మరో 5 రోజులు గడువు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన మంత్రి
ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించి ఆగస్టు 15 వరకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 10, సోమవారం వరకు ఉంది. గత నెల జూలై 21వ తేదీ నుంచి మీ-సేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్ ద్వారా, మీ-సేవా వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణకు అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి
ఆగస్టు 10, సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. వరుసగా సెలవులు రావడంతో మరింత మంది అర్హులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో గడువు పొడిగించినట్లు మంత్రి పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశం
దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినప్పటికీ, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై దరఖాస్తుదారులు ఎటువంటి అపోహలు, అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications