Viral Video: వానలకోసం మొసలికి పూజలు చేసిన పురోహితుడు.. వీడియో వైరల్
ఎల్నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వానలు పడాలని కోరుకుంటూ ప్రభుత్వం మహావరుణయాగం నిర్వహించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. అయితే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఓ పురోహితుడు మొసలికి పూజలు నిర్వహించాడు. ఈ ఆసక్తికరమైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద జరిగింది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారంతా మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందంటే..?
వరుస సెలవులు కావడంతో బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నది ఓడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మొసలి నదిలోంచి పుష్కర్ ఘాట్ వైపునకు దూసుకొచ్చింది. మొసలిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.

అలా ఆ మొసలి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. ఆ విషయం పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మకు తెలియడంతో ఆయన అక్కడకు వచ్చారు. మొసలి ముందు కూర్చుని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. అలా కుంకుమ, పసుపు, పుష్పాలతో అభిషేకం నిర్వహించాడు. వరుణ దేవుడి వాహనమైన మొసలికి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు ఆ తర్వాత పురోహితుడు అనిల్ శర్మ తెలిపాడు. రాష్ట్రంలోని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజలు చేసినట్లు స్పష్టం చేశారు.
A priest in Telangana's Beechupalli performed puja to a crocodile that came onto the bank of Krishna River. Later, forest officials released the reptile into the river..#crocodile #telangana pic.twitter.com/9f9akG24ca
— Arun Sandilya (@arunsandilya) August 9, 2026
ఇక పురోహితుడు పూజలు చేసినంత సేపూ మొసలి ఎక్కడికీ వెళ్లకుండా.. దాడి చేయకుండా అలానే ఉండిపోయింది. మొసలి అలా మౌనంగా, ప్రశాంతంగా కదలకుండా ఉండటాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలను మొత్తం కొందరు వీడియో తీశారు. అనంతరం స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే పుష్కర ఘాట్ కు చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది.. మొసలిని సురక్షితంగా బంధించి నదిలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications