Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష- సొంత ప్రజలపై నరమేథానికి..!
సిరియా(Syria)లో తిరుగుబాటు తర్వాత పదవీచ్యుతుడై, అజ్డాతంలో ఉంటున్న మాజీ అధ్యక్షుడు, నియంతగా పేరున్న బషర్ అల్ అస్సాద్ (Bashar al-Assad)కు ఇవాళ భారీ షాక్ తగిలింది. సొంత ప్రజలపై నరమేథానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మరణశిక్ష విధిస్తూ సిరియా రాజధాని డెమాస్కస్ లోని క్రిమినల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అస్సాద్ తో పాటు దేరా ప్రావిన్స్ మాజీ పొలిటికల్ సెక్యూరిటీ విభాగం అధిపతి అతెఫ్ నజీబ్‌కు కూడా కోర్టు ఇదే శిక్షను ఖరారు చేసింది.
సిరియాలో దశాబ్దాల పాటు సాగిన అణచివేత, సొంత పౌరులపైనే సాగించిన దారుణాలపై విచారణ జరిపిన క్రిమినల్ న్యాయస్థానం.. ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. అస్సాద్ హయాంలో స్వదేశీ ప్రజలపై నరమేధం సృష్టించడంతో పాటు రసాయన దాడుల ద్వారా తీవ్ర అణచివేతకు పాల్పడినట్లు ఆయనపై తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయనను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన దోషిగా కోర్టు నిర్ధారించింది. ప్రస్తుతం అస్సాద్ సిరియాలో అందుబాటులో లేకపోవడంతో, ఆయన గైర్హాజరీలోనే ఈ విచారణను పూర్తి చేసి శిక్షను ఖరారు చేశారు. మరో నిందితుడు అతెఫ్ నజీబ్‌పై పథకం ప్రకారం పౌరులను హత్యచేయడం, ఖైదీలను చిత్రహింసలు పెట్టడం వంటి నేరాలు రుజువయ్యాయి.

స్వదేశంలో తిరుగుబాటు దళాల ముట్టడితో 2024 డిసెంబర్‌లో బషర్ అల్ అస్సాద్ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలింది. దీంతో దేశాన్ని వదిలి పారిపోయిన అస్సాద్‌కు రష్యా ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. డమాస్కస్ నగరాన్ని విపక్ష దళాలు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆయన ప్రత్యేక విమానంలో మాస్కోకు పారిపోయారు. అప్పటి నుంచి ఆయన తన కుటుంబంతో కలిసి రష్యాలోనే ఉంటున్నారు. ఈ కేసులో దోషిగా తేలిన అతెఫ్ నజీబ్.. సిరియా విప్లవానికి మూలకేంద్రమైన దేరా ప్రావిన్స్‌లో అత్యంత క్రూరమైన అధికారిగా ముద్రపడ్డారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసిన పౌరులపై, స్కూల్ విద్యార్థులపై కూడా ఆయన బలగాలతో పాల్పడిన హింసే.. సిరియాలో అస్సాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి దారితీసింది. అయితే రష్యా రక్షణలో ఉన్న అస్సాద్‌ను తిరిగి సిరియాకు తీసుకువచ్చి ఈ శిక్షను అమలు చేయడం అంత సులువు కాదని తెలుస్తోంది.




Click it and Unblock the Notifications