US Visa: అమెరికా వీసా కోసం మన విద్యార్దులేం చేస్తున్నారో తెలుసా ? అయినా..!
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వలసదారులతో పాటు విద్యార్దులపైనా ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసాలతో పాటు ఇప్పటికే ఉన్న వీసాలనూ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్ధులకు వీసాలు ఇచ్చే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అమెరికాలో తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలు కూడా అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు ఆలోచనలో పడుతున్నారు.
అమెరికాలో విద్యార్ధి వీసాలు పొందే వారికి సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా క్లీన్ గా ఉండాలనే నిబంధనల్ని ట్రంప్ సర్కార్ అమలు చేస్తోంది. దీంతో విద్యార్ధులకు వీసాలు ఇచ్చే ముందు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. అనంతరం అంతా క్లీన్ గా ఉందనుకుంటేనే వీసాలు జారీ చేస్తున్నారు. అమెరికాలోని పలు యూనివర్శిటీల్లో ఈ మధ్య పాలస్తీనా అనుకూల నిరసనల్ని విద్యార్ధులు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నారు.

దీంతో భారతీయ విద్యార్ధులు ఇప్పటికే ఉన్న తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను చెక్ చేసుకుంటున్నారు. వాటిలో ఏదైనా వివాదాస్పద పోస్టులు పెట్టి ఉంటే వాటిని డిలీట్ చేసేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా పోస్టుల్ని డిలీట్ చేస్తున్న భారతీయ విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీంతో ట్రంప్ సర్కార్ వ్యూహం మారుస్తోంది. ప్రస్తుతం విద్యార్ధుల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న పోస్టులతో పాటు గతంలో పెట్టి డిలీట్ చేసేసిన పోస్టుల్ని సైతం రికవరీ చేస్తోంది. ఇందుకు అమెరికాలోనే ఉన్న సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, ఎక్స్ ల సాయం తీసుకుంటోంది.

మరోవైపు ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్ధుల సోషల్ ఖాతాల్లో పోస్టులే కాదు, ఇతరులు పెట్టిన వివాదాస్పద పోస్టులకు లైక్ లు కొట్టినా, షేర్ లు చేసినా వాటిని కూడా నిశితంగా పరిశీలిస్తోందని నిపుణులు చెప్తున్నారు. దీంతో గతంలో పోస్టులు పెట్టిన వారితో పాటు వాటికి లైక్ లు కొట్టిన వారు, షేర్లు చేసిన వారు కూడా ఇబ్బందుల్లో పడుతున్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన పోస్టులు కాకపోయినా ఓ మోస్తరు వివాదాస్పద పోస్టులకు సైతం ఇదే పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో విద్యార్ధులకు చుక్కలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications