భారత్ కు బిగ్ షాక్: హార్మూజ్ లో డ్రోన్ దాడిలో మునిగిపోయిన భారత నౌక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న భారత జెండా కలిగిన రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో రవాణా నౌక 'హాజీ అలీ' మునిగిపోయింది. సోమాలియాలోని బెర్బెరా నుంచి షార్జాకు ప్రయాణిస్తున్న ఈ నౌక.. ఒమన్ లోని లీమా సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకుంది. అనుమానిత డ్రోన్ దాడి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే అప్పటికే నౌకలోని 14 మంది భారతీయ సిబ్బంది లైఫ్ బోట్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.
అయితే హార్మూజ్ జలసంధింలో భారత నౌకపై డ్రోన్ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదు అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా హార్మూజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. గతంలోనూ ఇక్కడ కొన్ని భారతీయ నౌకలు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాయి.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంప్ భేటీ అయ్యారు. ఇరాన్ కు అణ్వాయుధం ఉండకూడదనే అంశంపై అమెరికా- చైనా ఏకాభిప్రాయానికి వచ్చాయి. అలాగే ప్రపంచ దేశాలకు ఇంధన వనరుల సప్లై నిరాటంకంగా జరిగేందుకు హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇక హార్మూజ్ జలసంధి మార్గంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి.. మరింత చమురును కొనుగోలు చేసేందుకు చైనా అధ్యక్షుడు ఆసక్తి చూపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications