2036 నాటికి 152 కోట్లు దాటనున్న జనాభా-పెరగనున్న మహిళలు-కేంద్రం తాజా అంచనా..!
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న భారత్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా సాగుతోంది. ఇప్పటికే 144 కోట్ల జనాభాతో టాప్ లో ఉన్న భారత్.. వచ్చే పుష్కర కాలంలో ఏ మేరకు జనాభాను పెంచుకోబోతందన్న అంశంపై కేంద్రం తాజా అంచనాలు విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ 2036 నాటికి 152 కోట్ల జనాభాను దాటేస్తుందని అంచనా వేసింది. అలాగే మహిళల వృద్ధి రేటు కూడా పెరకబోతోందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ దేశంలో జనాభా పెరుగుదలపై తాజా అంచనాలు వెల్లడించింది. ఇందులో 2036 నాటికి 152.2 కోట్లకు దేశ జనాభా చేరబోతోంది. అలాగే మహిళా జనాభా స్వల్పంగా పెరగనుంది. 2011లో మహిళా జనాభా దేశం మొత్తం జనాభాలో 48.5 శాతం ఉండగా.. అది 2036 నాటికి స్వల్పంగా పెరిగి 48.8 శాతానికి చేరనున్నట్లు తెలిపింది. అంటే ఓవరాల్ గా చూస్తే వచ్చే 12 ఏళ్లలో మహిళా జనాభా కేవలం 0.3 శాతమే పెరగనుంది.

2023లో మహిళలు మరియు పురుషులు పేరుతో వెలువరించిన ఈ నివేదికలో వచ్చే 12 ఏళ్లలో 15 ఏళ్ల లోపు జనాభా కూడా తగ్గనున్నట్లు తెలిసింది. జననాల వృద్ధి తగ్గడమే ఇందుకు కారణం. అలాగే 60 ఏళ్లకు పైగా వ్యక్తుల జనాభా పెరగనున్నట్లు తేలింది.
2036 నాటికి భారత్ లో మహిళా జనాభా పెరుగుదల వల్ల ప్రస్తుతం ఉన్న స్త్రీపురుషుల నిష్పత్తి 943 నుంచి 952కు చేరబోతోందని ఈ రిపోర్టు తెలిపింది. దీంతో స్త్రీ పురుషుల సమానత్వం దిశగా మరో అడుగు పడుతుందని అంచనా వేశారు.తద్వారా దేశంలో స్త్రీపురుష సమానత్వం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలితం ఇచ్చినట్లే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications