భారత్-చైనా ఘర్షణ: డ్రాగన్ కంట్రీని ఎలా డీల్ చేయాలి..పాఠకులు ఏమంటున్నారంటే..?
భారత్ - చైనాల మధ్య జూన్ 15న గాల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక కల్నల్‌తో సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. మరో 70 మంది గాయపడ్డారు. అయితే చైనాలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అయితే డ్రాగన్ కంట్రీ మాత్రం తమ సైనికుల మరణాల సంఖ్యను ఎక్కడా ధృవీకరించకుండా దాచి ఉంచింది.
ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ ప్రదర్శించిన అత్యంత పాశవిక చర్యపై భారత్ ఎలా రియాక్ట్ అవ్వాలన్న దానిపై వన్ ఇండియా తెలుగు తమ పాఠకుల స్పందన తెలపాల్సిందిగా సోషల్ మీడియాతో పాటు వన్ ఇండియా మెయిల్ ఐడీ ఇస్తూ ఒక క్యాంపెయిన్ నిర్వహించింది. చాలా మంది పాఠకులు తమ స్పందన తెలియజేయగా అందులో కొందరివి ఇక్కడ పొందుపరుస్తున్నాం.

చైనా వస్తువులపై నిషేధం
భారత్-చైనా మధ్య గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణపై పలువురు పాఠకులు స్పందించారు. ఇందులో చాలామంది పాఠకులు చైనా వస్తువులను భారత్ కొనుగోలు చేయడం తక్షణమే ఆపేయడంతో పాటు చైనా వస్తువులను భారత్‌లోనిషేధం విధించాలని కోరారు. చైనా వస్తువులను భారత్ కొనుగోలు చేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు ఒక కారణంగా నిలుస్తోందని బాబు రాజేంద్ర ప్రసాద్ అనే పాఠకుడు తన స్పందన తెలిపాడు. మరో వైపు చైనా వస్తువులు కొనుగోలు చేయడంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ శాతం ఉందని సహదేవ్ శామ్యూల్ అనే మరో పాఠకుడు తన అభిప్రాయం తెలిపాడు.

సరిహద్దులో గోడ నిర్మాణం
ఇదిలా ఉంటే అభినవ్ గంజి అనే మరో పాఠకుడు భారత్-చైనా సరిహద్దులో భారత్ ఒక గోడ నిర్మాణం చేపట్టాలని అభిప్రాయపడ్డాడు. ఇది ఒక్క భారత్-చైనా విషయంలోనే కాదని భారత్‌తో సరిహద్దు చేస్తున్న అన్ని దేశాల మధ్య గోడ నిర్మించాలని ఆయన తన స్పందన తెలియజేశాడు. అయితే అభినవ్ గంజి అభిప్రాయం ఒక్కింత న్యాయంగానే కనిపిస్తుందని మరొక పాఠకుడు తన ఒపీనియన్‌ను వెల్లడించాడు. ఇదిలా ఉంటే చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మరొక వ్యక్తి శ్రీనివాస్ పేర్కొన్నాడు.

యువతను సంపదను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలి
ఇక చైనా పై ప్రతీకారం తీర్చుకోవడమే కాదు.. చైనా వస్తువులను భారత్ బహిష్కరించాలని మరో పాఠకుడు మన్నె సుభాష్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇవ్వాళ చైనా రేపు ఇంకో దేశం.. ఇలా ఎన్నిసార్లు అంటూ మరో పాఠకుడు దీపక్ ప్రశ్నించాడు. ముందు భారత్ మారాలంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. భారత దేశంలో ఉన్న సంపద, యువతను సరిగ్గా ఉపయోగించుకుంటే చాలని చిరంజీవి రెడ్డి అనే పాఠకుడు పేర్కొన్నాడు. ఇలా చేయగలిగితే ముందుగా చైనా వస్తువులు మన దేశంలోకి రావని అభిప్రాయపడ్డ చిరంజీవి రెడ్డి... జపాన్ తమ దేశానికి కావాల్సిన వస్తువులు తమదేశంలోనే తయారు చేసుకుంటుందని ఉదహరించాడు. ఇక మేకిన్ ఇండియాను సరిగ్గా పాటిస్తే మంచి ఫలితాలు దక్కుతాయని శివరాం ప్రసాద్ అనే పాఠకుడు అభిప్రాయపడ్డాడు.
Recommended Video

చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలి
ఇదిలా ఉంటే కొందరు మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. చర్చల ద్వారానే సరిహద్దు వివాదంకు చెక్ పెట్టాలని పలువురు కోరారు. చాలామంది యుద్ధమే సమస్యకు పరిష్కారం అని చెబుతున్నారని అయితే యుద్ధం అనే మాట మాట్లాడటం చాలా సులభమని దాని వల్ల ఇటు ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా వాటిల్లుతుందని జీవీ లావణ్య అనే పాఠకురాలు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications