Ayodhya Interesting Fact:ఈ లడ్డూలో వాడిన పదార్థాలు ఏంటి..ఎవరు చేశారు?
అయోధ్య: 2020 ఆగష్టు 5 దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు. దశాబ్దాలుగా వివాదాలతో ముడిపడిన అయోధ్య రామమందిరంకు భూమిపూజ జరిగిన రోజు. ఈ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఘనంగా జరుపుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ రామమందిర నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. అయోధ్య నగరమంతా రామమయంగా మారింది. ఎటు చూసినా ఎటు విన్నా జైశ్రీరామ్ నినాదాలే మారుమ్రోగాయి. ఇక భూమిపూజకు ఏర్పాట్లు గత కొద్దిరోజులుగా జరిగాయి. ఇందుకోసం పూజ కోసం కావాల్సిన వన్నీ వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక భూమి పూజ సందర్భంగా ప్రసాదంలో భాగంగా లడ్డూలు ఇవ్వడం జరిగింది. ఈ లడ్డూలకు ఎంతో ప్రత్యేకత ఉంది.

ప్రసాదంగా స్పెషల్ లడ్డూ
సాధారణంగా తిరుపతి లడ్డు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది. తిరుపతికి వెళుతున్నారంటే తప్పకుండా తిరుమల లడ్డు తీసుకురమ్మని మనతో మన స్నేహితులు లేదా బంధువులు చెబుతుంటారు. ఎందుకంటే ఆ లడ్డూకు ఉన్న రుచి అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్టే వేరు కాబట్టి. ఇప్పుడు మళ్లీ ఆస్థాయిలో రామమందిరం నిర్మాణం సందర్భంగా భూమిపూజ జరిగిన సమయంలో లడ్డూను ప్రసాదంగా ఇచ్చారు. ఈ లడ్డూ కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ లడ్డూను తయారీలో వినియోగించిన పదార్థాలు చాలా ప్రత్యేకం. దేశ నలుమూలల నుంచి తెప్పించిన పదార్థాలతో ఈ లడ్డూను తయారు చేయడం జరిగింది.

లడ్డూకు ఏ పదార్థాలు వాడారు.?
లడ్డూకు కావాల్సిన కేసర్ ఉత్తర భారతంలోని కశ్మీర్ నుంచి తెప్పించారు. దక్షిణభారతంలోని కేరళ నుంచి యాలకలు, జీడిపప్పు, ఎండు ద్రాక్షా తెప్పించారు. ఇక ఇందులో వినియోగించిన నెయ్యిని కర్నాటక నుంచి తెప్పించారు. మొత్తం 1.25 లక్షల లడ్డూలు తయారు చేసి వచ్చిన వారికి ప్రసాదంగా పంచడం జరిగింది. మొత్తం మీద ఈ లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్నాటకకు చెందిన వారికి లడ్డూ తయారీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ వేడుక జరిగే 24 గంటల ముందు ఈ కాంట్రాక్ట్ వారికి అప్పగించింది. ముందుగా 51వేల లడ్డూలు తయారు చేసి సిద్ధం చేసిన ఈ బృందం మిగతా వాటిని కూడా మరో 24 గంటల్లో తయారు చేసింది. ఇక ప్రధాని హాజరు అవుతుండగా ఈ లడ్డూలను మరింత నాణ్యతతో తయారు చేశారు. ఎక్కడా రాజీ పడలేదు.

ఎక్కడ తయారు చేశారు..?
ఇక 100 మంది ఈ లడ్డూల తయారీలో నిమగ్నమయ్యారు. వీరంతా హనుమాన్ గడీకి 2 కిలోమీటర్ల దూరంలో అమావా ఆలయంలో ఉండి తయారు చేశారు. 100గ్రాముల లడ్డూ తయారు చేయడానికి అరగంట సమయం తీసుకుందని తయారీ దారులు చెప్పారు.ఇదిలా ఉంటే అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని గతేడాది సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పిన తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు వేగం అందుకున్నాయి. ఇక వెంటనే ట్రస్టు ఏర్పాటు చేయడం రామమందిరంకు భూమిపూజ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బుధవారం జరిగిన భూమిపూజ వేడుకలో ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో వేదికను పంచుకున్నారు.