వెంకయ్య వ్యాఖ్యపై దుమారం: క్షమాపణకు డిమాండ్, బాధిస్తే సారీ కానీ!
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు గురువారం ఉదయం లోకసభలో గందరగోళానికి దారి తీశాయి. కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య సభ్యుల పట్ల అవహేళనగా మాట్లాడారని, అందుకు క్షమాపణ చెప్పాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
సభ్యుల పట్ల గౌరవం ఉందని వెంకయ్య నాయుడు చెప్పారని సభాపతి సుమిత్రా మహాజన్ సభ్యులకు తెలిపారు. ప్రతిసారి, ప్రతి విషయానికి ఆందోళన సరికాదన్నారు. రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం గమనార్హం. విపక్ష నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వెంకయ్య అన్నారు. దీనిపై దుమారం రేగింది.
వెంకయ్య క్షమాపణ చెప్పాలని లేదంటే తాము రైల్వే బడ్జెట్‌ను అడ్డుకుంటామని విపక్షాలు హెచ్చరించాయి. దీంతో సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడింది. వెంకయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి.

దీనిపై వెంకయ్య మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను విపక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నాయన్నారు. నిజాయితీగా మాట్లాడటమే తనకు తెలుసునని, ఎవరిని ఉద్దేశించి తాను మాట్లాడలేదన్నారు. తాను ఎప్పుడు అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలన్నారు. కాగా లోకసభ రెండుసార్లు వాయిదా పడింది.
కాగా, వెంకయ్య అంతకుముందు ఢిల్లీ ఎన్నికల ఫలితాల పైన మాట్లాడుతూ.. ఢిల్లీలో లోకసభ ఎన్నికల్లో ఏడు లోకసభ స్థానాలు గెలుచుకున్నాక.. కూడా తాము ఓటమి చెందడంపై రివ్యూ చేసుకుంటామని, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా సున్నాకు ఎందుకు పడిపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞత చెప్పే తీర్మానం.. సమయంలో వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications