International women's day 2024: మహిళా శక్తికి వందనం... మీ భాగస్వామ్యమే దేశానికి ముఖ్యం!!
మగువ.. సృష్టికి మూలం. అవనిలో సగం.. ఆకాశంలో సగం.. కానీ అవకాశాలలో కూడా సగం అంతకు మించి అని నిరూపించుకోవాలి. మహిళల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా, మహిళా సాధికారతకు పట్టం కట్టేలా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం.
మహిళ పోషించని రోల్ లేదు. ఆమె శక్తి అపరిమితం , ఆమె సహనం అనన్య సాధ్యం.. ఆమె తెగువ ప్రశంసనీయం. తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా, కష్టాల సమయంలో ఆత్మీయ నేస్తంగా, ఉద్యోగ, వ్యాపారాలలో తమకు తామే సాటిగా దూసుకుపోతున్న మహిళ యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే.

అటువంటి మహిళల గొప్పతనాన్ని చెప్పుకోవటానికి మహిళా దినోత్సవం ఒక వేదిక . కార్మిక ఉద్యమం నుండి పుట్టిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మహిళలకు సంబంధించిన ఒక కొత్త అంశాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్ తో ప్రతి సంవత్సరం మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుంది.
ఈ సంవత్సరం ఆర్ధిక స్వావలంబనకు మహిళలను ప్రోత్సహిస్తే వారు ప్రగతికి బాటలు వేస్తారన్న థీమ్ ను ఎంచుకుని ఆ ధీమ్ ద్వారా మహిళా సాధికారతకు ఈ ఏడంతా కృషి చెయ్యాల్సిన అవసరం ఉంది. . ఈ సంవత్సరం మహిళాదినోత్సవాన్ని మహిళల్లో పెట్టుబడి ప్రగతిని వేగవంతం చేయాలనే థీమ్‌తో జరుపుకుంటున్నాం. గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం లింగ సమానత్వం మాత్రమే కాదు ప్రతి చోట మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడాన్ని ప్రచార థీమ్ గా నిర్ణయించారు.
ఈ సంవత్సరం రేపటి కోసం, మహిళా సాధికారత కోసం చేయాల్సిన ఎన్నో పనులను దిశనిర్దేశం చేస్తున్న ఐక్యరాజ్యసమితి, ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సామర్ధ్యాన్ని పెట్టుబడిగా పెట్టి ఆర్ధిక ప్రగతి సాధించాలని చెప్పారు. మహిళల్లో నిబిడీకృతమై ఉన్న శక్తిని బయటకు తీయడమే కాకుండా, మహిళా చైతన్యాన్ని, మహిళలు సాధించిన విజయాలను, పదిమందికి తెలియచేయటం ముఖ్యం.
మహిళలలో స్ఫూర్తి నింపి ముందుకు నడిపించడం, భవిష్యత్తుకు మహిళలకు దిశా నిర్దేశం చేయటం కోసం మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళలు సాధించిన ఎన్నో విజయాలు, వారి గొప్పతనాన్ని మహిళా దినోత్సవం వేదికగా చెప్పడం వల్ల అది ప్రతి ఒక్కరిలో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో వారు సాధించాల్సిన అనేక విజయాలకు కూడా మహిళా దినోత్సవం వేదికగా మారింది. మీ భాగస్వామ్యమే దేశానికి ముఖ్యమని ఈ మహిళా దినోత్సవం చెప్తుంది.












Click it and Unblock the Notifications