IPL 2023: అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ పై బ్రెట్ లీ ప్రశంసలు-డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా..
ఐపీఎల్ 2023లో తొలి దశ మ్యాచ్ లు జోరుగా సాగుతున్నాయి. పలువురు యువ క్రికెటర్లు ఈ సీజన్ లో తమ జట్ల తరఫున అరంగేట్రం చేశారు. ఇందులో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ పేసర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన సత్తా నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పలువురు తాజా, మాజీ క్రికెటర్లు అర్జున్ బౌలింగ్ పై స్పందిస్తున్నారు.
ముంబై తరఫున అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేశాడు. రెండేళ్ల క్రితమే ముంబై జట్టుకు ఎంపికైనా ఆడే అవకాశం రాని అర్జున్.. ఈ సీజన్ లో మాత్రం తుదిజట్టులో చేరాడు. వరుసగా రెండు మ్యాచ్ లు కూడా ఆడాడు. ఇందులో కోల్ కతాతో మ్యాచ్ తో పాటు హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ ల్లో ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ పై మ్యాచ్ లో డెత్ ఓవర్స్ లో అర్జున్ బౌలింగ్ పై ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ కూడా స్పందించాడు.

సన్ రైజర్స్ పై డెత్ ఓవర్లలో అర్జున్ బౌలింగ్ పై స్పందించిన బ్రెట్ లీ.. అతను ఒత్తిడిని బాగా తట్టుకున్నాడని ప్రశంసించాడు. ఆ చివరి ఓవర్‌లో కేవలం 4-5 పరుగులు మాత్రమే ఇచ్చి, ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ను అందుకున్నాడన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కు అభినందనలు కూడా తెలిపాడు. చివరికి ఏమి జరిగినా డెత్‌లో బౌలింగ్ చేసిన అనుభవం అర్జున్ కు పనికొస్తుందన్నాడు. దీన్ని మరింత మెరుగుపర్చుకోవాలని సూచించాడు.
సన్ రైజర్స్ మ్యాచ్ లో అర్జున్ ఓ వైడ్-లైన్ యార్కర్‌ను నెయిల్ చేయడానికి ప్రయత్నించాడని, దానిని చాలా బాగా చేసాడని బ్రెట్ లీ ప్రశంసించాడు. కేవలం రెండో మ్యాచ్ ఆడుతూ అలా చేయడం చాలా కష్టమన్నాడు. జట్టు మొత్తం అతనిపై ఆధారపడటంతో అర్జున్ ఒత్తిడికి లోనయ్యాడని బ్రెట్ లీ విశ్లేషించాడు. కానీ అర్జున్ తప్పుపట్టలేనంతగా తనను తాను మెరుగుపరుచుకున్నాడన్నాడు. భవిష్యత్తులో అర్జున్ మరింత మెరుగ్గా రాణించే అవకాశముందన్నాడు.












Click it and Unblock the Notifications