వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌లో 'దిశ చట్టం' అమలులో ఉందా, మహిళలకు ఈ చట్టంతో మేలు జరిగిందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019' 'ఏపీ 'దిశ' యాక్ట్‌ పేరుతో అసెంబ్లీలో ఆమోదం పొంది రెండేళ్లు కావస్తోంది.

దిశ చట్టం కింద పలు కేసుల్లో నిందితులపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటనలు వస్తున్నాయి.

దిశ పేరుతో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.

యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే, వాస్తవానికి ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలుకి నోచుకోవడం లేదు. దాంతో దిశ చట్టం పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

'దిశ' చట్టం ఏమయ్యింది?

2019 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో దిశ ఘటన తర్వాత అదే నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేసి 'దిశ చట్టం' తీసుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019తో పాటు 'ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్ట్ ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌- 2019' కూడా ఆమోదించి అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది.

ఏపీలో శాసన ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చట్టంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా ఇండియన్ పీనల్ కోడ్‌లో మార్పులు తీసుకురావడం వల్ల ఈ చట్టం అమలు కావాలంటే కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది.

తాము లేవనెత్తిన అంశాలకు ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది.

మొన్నటి వర్షాకాల సమావేశాల సందర్భంగా జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా దీనిపై లిఖితపూర్వక సమాధానమిస్తూ తమ అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని స్పష్టం చేశారు.

దిశ చట్టం

కేంద్రం అభ్యంతరాలు ఏమిటి?

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణల ప్రకారం అత్యాచార కేసుల్లో నేరం జరిగినట్లు నిర్ధారించే కచ్చితమైన ఆధారాలు ఉంటే, దోషులకు 21 రోజుల్లోపే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్లు 173, 309లను ఈ మేరకు సవరించారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో అదనంగా 354(ఇ), 354(ఎఫ్‌) సెక్షన్లను చేరుస్తూ చట్టం రూపొందించారు.

వీటికి సంబంధించి కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే దేశమంతా అమలవుతున్న చట్టంలో, సవరణలతో చేసిన ప్రత్యేక వ్యవస్థ వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను కేంద్రం ప్రస్తావిస్తోంది.

దిశ చట్టం అమలు కోసం రాష్ట్ర స్థాయిలో ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను దిశ స్టేషన్లుగా తీర్చిదిద్దారు.

ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని చట్టంలో ప్రతిపాదించారు.

మహిళలకు సంబంధించిన దాడులు, వేధింపుల కేసుల్లో వారం రోజుల్లో పోలీసుల దర్యాప్తు, ఆ తర్వాతి 14 రోజుల్లో ప్రత్యేక కోర్టు విచారణ ముగించాలని చట్టంలో పేర్కొన్నారు. మొత్తంగా ఈ చట్టం ప్రకారం ఘటన జరిగిన 21 రోజుల్లో తీర్పు రావాల్సి ఉంటుంది.

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని 354 (ఎఫ్‌)లో పేర్కొన్నారు. తీవ్ర నేరాలకు ముఖ్యంగా అత్యాచార కేసుల్లో కచ్చితమైన ఆధారాలుంటే 21 రోజుల్లోనే దోషులకు మరణ శిక్ష విధించేలా ఈ చట్టాలను తీసుకొచ్చారు. గతంలో ఇలాంటి నేరాలకు 'పోక్సో చట్టం' కింద మూడు నుంచి ఐదేళ్ల వరకూ శిక్ష విధించేవారు.

354(ఇ) ప్రకారం మెయిల్, సోషల్‌మీడియా, డిజిటల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్ట్‌లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండో సారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించొచ్చని ఈ చట్టం చెబుతోంది.

దిశ చట్టం వచ్చిన తర్వాత ఏం జరిగింది

దిశ చట్టం ద్వారా ఏపీలో మహిళలకు పూర్తి రక్షణ వస్తుందని, వేధింపులు, హత్యాచారాలు అరికడతామని ప్రభుత్వం ప్రకటించింది.

కానీ మహిళలపై పలు చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గుంటూరులో బీటెక్ రమ్య హత్య, అంతకు ముందు సీఎం ఇంటికి సమీపంలో తాడేపల్లి దగ్గర కృష్ణా నది ఒడ్డున అత్యాచారం లాంటి ఘటనలు సంచలనం సృష్టించాయి.

రాష్ట్రవ్యాప్తంగా దిశ చట్టం ఆమోదించిన తర్వాత, అంటే డిసెంబర్ 12, 2019 నుంచి ఇప్పటి వరకూ 400కు పైగా లైంగిక దాడుల కేసుల్లో మహిళలు బాధితులుగా ఉన్నారు. కానీ ఈ కేసుల్లో నిందితులకు గత చట్టాల ప్రకారమే శిక్షలు పడుతున్నాయి.

రమ్య హత్య సహా వివిధ కేసుల్లో పోలీసుల విచారణ మాత్రం వేగవంతమయ్యింది. 7 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే అమలు చేశారు.

దిశ యాప్ కూడా మహిళలకు కొంతమేరకు ఉపయోగపడుతోంది. యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల క్యాంపెయిన్ కూడా నిర్వహించింది. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే సమీపంలో ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

దిశ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన మహిళా సంరక్షణా కార్యదర్శులను కూడా ఇటీవల పోలీస్ శాఖలో భాగం చేశారు. మహిళలకు క్షేత్రస్థాయిలో తక్షణ సాయం అందించేందుకు వారు ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తోంది.

హోంమంత్రి ఒకలా, పోలీస్ అధికారులు మరోలా..

దిశ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాలేదని కేంద్రం చెబుతోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ తాత్సారానికి కారణాలు వెల్లడించడం లేదు.

అదే సమయంలో ఏపీలో దిశ చట్టం అమలవుతోందని, ఆ చట్టం ప్రకారం కొందరికి మరణ శిక్షలు కూడా పడ్డాయని హోం మంత్రి మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఆమె ఒక స్థానిక మీడియా సంస్థతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

"ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మాని వాస్తవాలు తెలుసుకోవాలి. ఏపీలో దిశ యాప్‌ని 40 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దిశ యాప్‌ని చాలామంది ఉపయోగిస్తూ భద్రత పొందుతున్నారు. ఇప్పటి వరకూ 3.5 లక్షల మంది దిశ యాప్ వినియోగించి ప్రయోజనం పొందారు. ప్రత్యేకంగా డీఎస్పీ స్థాయి అధికారులతో 18 దిశ పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి.

విజయనగరంలో జరిగిన ఓ ఘటనలో ఏడు నెలల్లోనే దర్యాప్తు జరిపి, ఆధారాలు సేకరించి ఉరిశిక్ష ఖరారయ్యేలా చేశాం. అలాంటి పరిస్థితి ఏపీలో ఎన్నడూ లేదు. విజయవాడలో ఓ కేసులో నాలుగు నెలల్లోనే అలాంటి తీర్పు వచ్చేలా చేశాం. దిశ చట్టం అనేది కేవలం ప్రచారార్భాటాల కోసం కాకుండా మహిళల భద్రతకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతను చెబుతోంది. మహిళల రక్షణ కోసం చేసే ఈ ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదు. ఇంతకన్నా మంచి జరగడానికి ఏం చేయాలనే సూచనలు ఇస్తే మంచిది" అని హోంమంత్రి సుచరిత చెప్పారు.

కానీ ఆ తర్వాత గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ దిశ చట్టం అమలులో లేదని వ్యాఖ్యానించారు. ఆ చట్టం అమలులో లేకపోయినా తాము ఆ చట్టం స్ఫూర్తితో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. దానికి అనుగుణంగానే ఏడు రోజుల్లోనే ఛార్జిషీట్ ఫైల్ చేశామన్నారు.

దాంతో చట్టం అమలు విషయంలో హోంమంత్రి మాటలకు, పోలీస్ అధికారుల మాటలకు పొంతన లేకపోవడం చర్చకు దారితీసింది.

ప్రకటనలకే పరిమితం అవుతోంది..

దిశ చట్టం గురించి ప్రచారం ఎక్కువ జరిగింది గానీ, ఫలితాలు మాత్రం కనిపించడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి బీబీసీతో అన్నారు.

"మహిళల రక్షణ ప్రకటనలకే పరిమితమయ్యింది. దిశ చట్టాన్ని అసెంబ్లీలో హడావిడిగా ఆమోదించారు గానీ కేంద్రం నుంచి మాత్రం దాని అమలుకి అనుమతులు తీసుకురాలేకపోతున్నారు. ఇది జగన్ ప్రభుత్వ వైపల్యమే. చట్టం అమలులో లేకపోయినా చట్టం అమలు చేస్తున్నట్టుగా ప్రచారం మాత్రం జరుగుతోంది. ఫలితాలు కానరావడం లేదు. దిశా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంది. ఒకటి అరా తప్ప అనేక కేసులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్న చట్టాలు కఠినంగా అమలు చేసేందుకు దృష్టి పెట్టడం అత్యవసరం" అని ఆమె చెప్పారు.

దిశ చట్టానికి అడ్డంకులు తొలిగేదెలా

"దిశ చట్టం అమలు చేస్తే నేరాలన్నీ అరికట్టవచ్చనే ప్రచారం వాస్తవం కాదు. ఘటనలు జరిగిన తర్వాత నిందితులకు కఠిన శిక్షలు వేసేందుకు ఈ చట్టాన్ని సవరించారు. దానికోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. కానీ చట్టంలో తీసుకొస్తున్న మార్పుల మూలంగా సీపీసీ, ఐపీసీ సెక్షన్లలో వస్తున్న మార్పుల పట్ల కేంద్రం అభ్యంతరాలను మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు" అని సీనియర్ అడ్వొకేట్ ఎం భారతి తన అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు.

"ప్రభుత్వం కొత్త చట్టాల పేరుతో హడావిడి చేయడం కన్నా, ఉన్న చట్టాలనే పకడ్బందీగా అమలుచేయడంపై దృష్టి పెట్టాలి. దానికి అనుగుణంగా యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించేలా అందరినీ సన్నద్ధం చేయాలి. సిబ్బందిని సరిపడా నియమించాలి. దర్యాప్తు వేగంగా జరిపి, తగిన ఆధారాలు సేకరించేలా పోలీసు యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలి. పెరుగుతున్న నేరాలను అదుపుచేసేలా టెక్నాలజీ వినియోగం పెరగాలి" అని భారతి సూచించారు.

దిశ ప్రత్యేక అధికారి కృతిక శుక్లా మాత్రం ఈ పరిణామాలపై స్పందించలేదు. బీబీసీ ఆమె స్పందన కోసం కోసం ప్రయత్నించింది.

దిశ యాక్ట్ అమలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించడానికి ఆమె అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Is Disha act implemented in AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X