రష్యాను నమ్ముకుని భారత్ ఒంటరి ? ఫలించని తటస్ధ వైఖరి ! బైడెన్ కన్నెర్ర చేస్తే జరిగేదిదే !
ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దండయాత్ర విషయంలో భారత విద్యార్ధుల ప్రాణాలు అరచేత్తో పట్టుకుని స్వదేశానికి వచ్చేస్తున్నారు. అయినా భారత్ తన చిరకాల మిత్రదేశం రష్యాను ఈ విషయంలో సాయం కోరలేకపోతోంది. అదే సమయంలో ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై అంతర్జాతీయంగా ఆంక్షల పరంపర కొనసాగుతున్న వేళ.. భారత్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఆ దేశం నుంచి డిస్కౌంట్ పై చమురు తీసుకుంటోంది. యుద్ధంపై తమది తటస్ధ వైఖరి అంటూ అంతర్జాతీయ వేదికలపై చెబుతోంది. కానీ ఇప్పుడు ఈ తటస్ధ వైఖరి భారత్ ను ఒంటరి చేయబోతోందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

రష్యా దండయాత్రపై భారత్ మౌనం
ఉక్రెయిన్ పై అకారణంగా రష్యా దండయాత్రకు దిగడాన్ని ప్రపంచ దేశాలన్నీ ఏదో విధంగా ఖండిస్తున్నాయి. రష్యాకు భారత్ కంటే అతిపెద్ద మిత్రదేశమైన చైనా సైతం ఈ దండయాత్రను తప్పుబడుతోంది. సైనిక సాయం చేసేందుకు నిరాకరిస్తోంది. అలాంటి పరిస్ధితుల్లో భారత్ అంతర్జాతీయంగా తటస్ధ వైఖరి పేరుతో ఈ యుద్ధాన్ని ఖండించేందుకు కానీ, ఆపేందుకు కానీ, రష్యాను ఒంటరి చేసే ప్రయత్నాలకు కానీ ఊతమివ్వకపోగా.. రష్యాకు అండగా నిలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ వైఖరిపై సందేహాలు మొదలయ్యాయి.

భారత్ తీరుపై బైడెన్ అసహనం
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను అందరి కంటే ముందుగానే ఊహించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇప్పుడు అదే విషయంలో భారత్ ప్రదర్శిస్తున్న కప్పదాటు వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఐరోపాలో నాటోను ఏకం చేయడం ద్వారా రష్యానూ, దాని అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను ఏకాకిని చేయడంలో బైడెన్ సక్సెస్ అయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కూడా అదే మద్దతు సాధించాలని బైడెన్ భావిస్తున్నారు. నాలుగు క్వాడ్ దేశాల్లో భాగంగా ఉన్న భారత్.. రష్యా చర్యను ఖండించకుండా మౌనంగా ఉండటాన్ని బైడెన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రష్యా చర్యను ఖండిస్తున్న ఇతర క్వాడ్ దేశాలు ఆస్ట్రేలియా, జపాన్ ను బైడెన్ ప్రశంసించారు. తమ సైనిక సాయం, హార్డ్‌వేర్ కోసం ఎక్కువగా ఆధారపడిన జపాన్, ఆస్ట్రేలియాలా కాకుండా భారత్ భిన్నంగా స్పందిస్తుండటం బైడెన్ లో ఫ్రస్ట్రేషన్ పెంచుతోంది.

బైడెన్ ఫ్రస్ట్రేషన్ వెనుక ?
ప్రస్తుతం భారత్ నాటోలో సభ్యులుగా ఉండి కూడా రష్యా నుంచి డిస్కౌంట్ చమురు కొంటున్న దేశాల సరసన చేరింది.
దీంతో యూఎస్ వైఖరికి భిన్నంగా వీరంతా రష్యా నుంచి చమురు కొంటున్నట్లయింది. అంతర్జాతీయంగా మండుతున్న ముడి చమురు ధరలే ఇందుకు కారణం. అయితే ఈ వైఖరితో భారత్ చరిత్రలో దోషిగా మిగులుతుందని బైడెన్ హెచ్చరిస్తున్నారు. అయితే నాటో దేశాల విషయంలో మాత్రం రష్యా విషయంలో మాత్రం అవి మెతక వైఖరితో ఉన్న బైడెన్ మాత్రం వాటిని తప్పుబట్టడం లేదు. వాస్తవానికి యూరప్ తన ముడి చమురు అవసరాల్లో 27 శాతం రష్యా నుంచి తీర్పుకుంటోంది. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి కేవలం 1 శాతం చమురే తీసుకుంటోంది. కానీ యూఎస్ నుంచి మాత్రం 8 శాతం తీసుకుంటోంది. అందుకే బైడెన్ భారత్ విషయంలో ఇలా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ ఒంటరవుతోందా ?
అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్లో రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతోంది. అయితే మిగతా దేశాలతో పోలిస్తే రష్యాపై ఎక్కువగా ఆధారపడిన భారత్ మాత్రం అంతర్జాతీయంగా తటస్ధ వైఖరి పేరుతో అమెరికాకూ మద్దతిచ్చి సాయం పొందుతోంది. కానీ ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ పోరు విషయంలో ఆ తటస్ధ వైఖరి ఫలించేలా లేదు. రష్యాకు మిగతా దేశాలన్నీ దూరమవుతున్న వేళ.. భారత్ మాత్రం చిరకాల మిత్రదేశాన్ని వదులుకోలేక అమెరికాను కూడా ధిక్కరించే పరిస్ధితుల్లోకి వెళ్లిపోతోంది. ఇది అంతిమంగా యూఎస్ నుంచి భారత్ భవిష్యత్ అవసరాలపై ప్రభావం చూపేలా ఉంది. అలాగే అమెరికాను కాదని అగ్రరాజ్యాలు భారత్ కు సహకరించే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. చివరిగా భారత్ రష్యాను నమ్ముకుని ఒంటరయ్యే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications