వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సిందూనదీ జలాల ఒప్పందం

సింధు నదీజలాల పంపకాల అంశంపై భారత్, పాకిస్తాన్ అధికారులు మంగళవారం దిల్లీలో సమావేశమవుతున్నారు.

రెండేళ్ల తరువాత ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నదీజలాల పంపకాలతోపాటూ పరస్పరం నెలకొన్న ఆందోళనలపైనా చర్చించనున్నారు.

లద్దాఖ్‌లో భారత్ అనుమతించిన జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. పాకిస్తాన్ అధికారుల ప్రతినిధి బృందం ఒకటి మార్చి 23, 24 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చింది. ఇది శాశ్వత సింధు కమిషన్ 116వ సమావేశం..

ఒప్పందం రద్దుకు ఎన్నోసార్లు డిమాండ్లు

గత కొన్నేళ్లుగా భారత-పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏ గొడవ వచ్చినా, సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలనే విషయం తెరపైకి వస్తోంది.

సింధు జలాల ఒప్పందాన్ని నదీజలాల అంతర్జాతీయ పంపకానికి ఒక విజయవంతమైన ఉదాహరణగా చెబుతుంటారు.

భారత్-పాకిస్తాన్ 60 ఏళ్ల క్రితం ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

సిందూనదీ జలాల ఒప్పందం

రెండు దేశాల మధ్య కార్గిల్‌తో కలిపి మూడు యుద్ధాలు జరిగాయి. కానీ, ఎంత పెద్ద సమస్యలు వచ్చినా ఈ ఒప్పందం చెక్కుచెదరలేదు. వ్యతిరేక గళాలు వినిపించినా ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడలేదు.

ఉరీ తీవ్రవాద దాడి, పుల్వామా దాడులు జరిగినప్పుడు కూడా.. భారత్ సింధు నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని ఊహాగానాలు సాగాయే కానీ అలా జరగలేదు.

సింధు బేసిన్ ట్రీటీకి 1933 నుంచి 2011 వరకూ పాకిస్తాన్ కమిషనర్‌గా ఉన్న జమాత్ అలీ షా ఈ ఒప్పందం వివరాలు చెప్పారు.

"ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం ఎవరైనా, ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోడమో లేదంటే మార్చడమో కుదరదు. రెండు దేశాలు కలిసి చర్చించుకుని, ఈ సంధిలో మార్పులు చేయవచ్చు లేదా ఒక కొత్త ఒప్పందం చేసుకోవచ్చు" అన్నారు.

మరోవైపు, నదీజలాల పంపకాలపై అంతర్జాతీయ స్థాయి గొడవల గురించి ఒక పుస్తకం కూడా రాసిన బ్రహ్మ చెల్లాని 'ద హిందూ' దినపత్రికలో సింధు నదీజలాల ఒప్పందంపై ఒక వ్యాసం రాశారు.

అందులో "వియన్నా ఒప్పందం 'లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62’ ప్రకారం, పాకిస్తాన్ మాకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను ఉపయోగిస్తోందని చెప్పి, భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. మౌలిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే, ఏ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది" అని రాశారు.

సింధు నది పరివాహక ప్రాంతం దాదాపు 11.2 లక్షల కిలోమీటర్లు వ్యాపించి ఉంది. అది పాకిస్తాన్‌లో(47 శాతం), భారత్‌(39 శాతం), చైనా(8 శాతం), అప్గానిస్తాన్(6 శాతం)‌లో ఉంది.

ఒక అంచనా ప్రకారం సింధు నది చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 30 కోట్ల మంది జీవిస్తున్నారు.

సింధు నది జలాల ఒప్పందం వెనుక కథ

అమెరికా ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సింధు నదీ జలాల ఒప్పందం వెనుక కథ గురించి వివరంగా రాశారు.

1947లో భారత విభజనకు ముందు, ముఖ్యంగా పంజాబ్, సింధు ప్రాంతాల మధ్య ఈ గొడవ ప్రారంభమైందని ఎరాన్ వోల్ఫ్, జోషువా న్యూటన్ తమ అధ్యయనంలో చెప్పారు.

1947లో సమావేశమైన భారత, పాకిస్తాన్ ఇంజనీర్లు.. పాక్ వైపు వచ్చే రెండు ప్రధాన కాలువలపై 'స్టాండ్ స్టిల్' ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటి ప్రకారం పాకిస్తాన్‌కు వరుసగా జలాలు అందుతూ వచ్చాయి. ఈ ఒప్పందం 1948 మార్చి 31 వరకు అమలులో ఉంది.

కానీ, 1948 ఏప్రిల్ 1న ఈ ఒప్పందం అమలులో లేకపోవడంతో భారత్ ఆ రెండు కాలువలకు నీళ్లు ఆపేసిందని, దాంతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 17 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల పరిస్థితి దారుణంగా మారిందని జమాత్ అలీ షా చెప్పారు.

"భారత్ తమ చర్యలకు ఎన్నో కారణాలు చెప్పింది. వాటిలో, కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావాలని ఒకటి. తర్వాత జరిగిన ఒక ఒప్పందం ప్రకారం జలాల సరఫరాను కొనసాగించడానికి భారత్ అంగీకరించింది" అన్నారు.

ఈ అధ్యయనం ప్రకారం 1951లో ప్రధానమంత్రి నెహ్రూ టెనసీ వ్యాలీ అథారిటీ మాజీ చీఫ్ డేవిడ్ లిలియంథల్‌ను భారత్ పిలిపించారు. లిలియంథల్ పాకిస్తాన్ కూడా వెళ్లారు. తర్వాత తిరిగి అమెరికా వెళ్లిన ఆయన సింధు నదీజలాల పంపిణీపై ఒక వ్యాసం రాశారు. దానిని ప్రపంచ బ్యాంక్ చీఫ్, లిలియంథల్ స్నేహితుడు డేవిడ్ బ్లాక్ కూడా చదివారు. బ్లాక్ దాని గురించి భారత్, పాకిస్తాన్ ముఖ్యులను సంప్రదించారు. తర్వాత నుంచి రెండు పక్షాల మధ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు దాదాపు ఒక దశాబ్దంపాటు జరిగాయి.

చివరికి 1960 సెప్టెంబర్ 19న కరాచీలో సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

సిందూనదీ జలాల ఒప్పందం

సింధు జలాల ఒప్పందంలో ముఖ్యమైన విషయాలు

  1. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది ఉపనదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. సట్లజ్, బియాస్, రావి నదులను తూర్పు నదులుగా.. జీలం, చేనాబ్, సింధులను పశ్చిమ నదులుగా పేర్కొన్నారు.
  2. కొన్ని మినహాయింపులు తప్పిస్తే, భారత్ తూర్పు నదుల జలాను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అలాగే, పశ్చిమ నదుల జలాలను పాకిస్తాన్ వినియోగించవచ్చు. కానీ, భారత్‌కు ఆ నదుల్లో కొన్ని పరిమిత జలాలను ఉపయోగించుకునే హక్కు ఒప్పందంలో ఉంది. అంటే, జల విద్యుత్, వ్యవసాయం లాంటి వాటికి జలాలు వినియోగించవచ్చు. అందులో సమావేశాలు, సైట్ ఇన్‌స్పెక్షన్ లాంటి నిబంధనలు కూడా ఉన్నాయి.
  3. సింధు జలాల ఒప్పందం ప్రకారం ఒక శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేశారు. అందులో రెండు దేశాల కమిషనర్లు సమావేశం అవుతూ ఉండాలనే ప్రతిపాదన ఉంది. ప్రతి కొంతకాలానికి వీరు కలవాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా చర్చించుకోవాలి.
  4. ఏదైనా ఒక దేశం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం మీద పనిచేస్తుంటే, దాని డిజైన్ మీద ఇంకో దేశానికి అభ్యంతరం ఉంటే, ప్రాజెక్ట్ నిర్మించే ఆ దేశం దానిపై సమాధానం ఇవ్వాలి. రెండు పక్షాలూ సమావేశమై చర్చించాలి. కమిషన్ సమస్యను పరిష్కరించలేకపోతే, ప్రభుత్వాలు దానిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి.
  5. వీటితోపాటూ వివాదాలను పరిష్కారాలు గుర్తించడానికి తటస్థ నిపుణుల సాయం తీసుకోవచ్చని, లేదంటే కోర్ట్ ఆప్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లవచ్చని కూడా ఒప్పందంలో సూచించారు.
ఒప్పందంపై రాజకీయాలు

ఒప్పందంపై రాజకీయాలు

సింధు నదీ జలాల ఒప్పందం వల్ల భారత్‌కు ఆర్థికంగా నష్టం జరుగుతోందని దేశంలోని ఒక వర్గం భావిస్తోంది. దీనివల్ల తమ రాష్ట్రంలో ఏటా ఆర్థికంగా కోట్లు నష్టపోతున్నామని జమ్ముకశ్మీర్ చెబుతోంది. ఈ ఒప్పందంపై పునరాలోచించాలని 2003లో ఒక బిల్లు కూడా ఆమోదించింది. కశ్మీర్‌లో ఆగ్రహావేశాలు రెచ్చగొట్టడానికే పాకిస్తాన్ ఈ ఒప్పందంలోని ప్రతిపాదనలను ఉపయోగిస్తోందని కూడా దిల్లీలో కొందరు భావిస్తున్నారు.

"జలాలకు బదులుగా శాంతి లభిస్తుందనే ఉద్దేశంతోనే భారత్ 1960లోపాకిస్తాన్‌తో ఈ ఒప్పందం చేసుకుంది. కానీ, ఒప్పందం అమల్లోకి వచ్చిన ఐదేళ్లకే 1965లో పాక్ జమ్ముకశ్మీర్‌పై దాడి చేసింది" అని బ్రహ్మ చెల్లాని తన వ్యాసంలో చెప్పారు.

పాక్ పాలిత కశ్మీర్‌లో ఒక పెద్ద డామ్ కడుతున్నారని, భారత చిన్న ప్రాజెక్టులు కడుతున్నా.. పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తుతోందని ఆయన అన్నారు.

మరోవైపు పాకిస్తాన్ ఈ ఒప్పందం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, భారత్ వైపు నుంచి సంధిని రద్దు చేసుకోవాలంటూ వస్తున్న డిమాండ్లను భారత ప్రభుత్వం ఒప్పుకోదని జమాత్ అలీ షా అంటున్నారు.

"భారత్‌లో అలాంటి గొంతులు వినిపిస్తున్నాయంటే, దానికి అర్థమేంటి. భారత్ పాకిస్తాన్‌కు నీళ్లు ఆపేస్తుందా. పాకిస్తాన్ వాటా జలాలను తమ నదులకు మళ్లిస్తుందా, అలా చేయడానికి రాత్రికిరాత్రే ప్రణాళికలు వేయలేం. దానికి ప్లానింగ్ ఉంటుంది. ఆ తర్వాత జలాలు అడ్డుకోవడం జరుగుతుంది. అలా జరగడం అసాధ్యం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is India losing because of the Indus Waters Treaty,Why did they actually make the deal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X