ఇరాన్ వార్ లోకి పాకిస్తాన్..! సౌదీకి 8 వేల సైన్యం, ఫైటర్ జెట్లు..!
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ప్రారంభించిన యుద్దం మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వార్ లెబనాన్ కు పాకి ఇజ్రాయెల్ తో సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకునే వరకూ వెళ్లింది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ కు వార్ బేస్ లు ఇచ్చిన పాపానికి గల్ఫ్ దేశాలు విలవిల్లాడుతున్నాయి. అదే సమయంలో ఇన్నాళ్లూ అమెరికా-ఇరాన్ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ (Pakistan) ఈ యుద్దంలోకి దిగుతోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవడమే కాక అమల్లో కూడా పెట్టేసింది.
ఇరాన్ (Iran) దాడులతో బెంబేలెత్తుతున్న సౌదీ అరేబియా (Saudi Arabia) కు 8 వేల మంది సైనికులను, యుద్ధ విమానాల దళాన్ని, వాయు రక్షణ వ్యవస్థను పాకిస్తాన్ పంపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. సౌదతో ఉన్న పరస్పర రక్షణ ఒప్పందం కింద ఈ చర్య తీసుకున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన ఉన్నత సైనిక వర్గాలు ధృవీకరించాయి. అమెరికా-ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సమయంలోనే సౌదీ అరేబియాతో సైనిక సహకారాన్ని పెంచడం ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది.

తాము పంపిన సైన్యం, ఫైటర్ జెట్లు, వాయు రక్షణ వ్యవస్థలకు గణనీయమైన, పోరాట సామర్థ్యం ఉందని పాకిస్తాన్ అభివర్ణించింది. సౌదీ అరేబియాపై మరిన్ని దాడులు జరిగితే ఆ దేశ సైన్యానికి మద్దతుగా నిలవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ మోహరింపుపై పాకిస్థాన్ మిలిటరీ, విదేశాంగ శాఖ లేదా సౌదీ అరేబియా ప్రభుత్వ మీడియా కానీ అధికారికంగా స్పందించలేదు. గత ఏడాది కుదిరిన ఆ రక్షణ ఒప్పందం వివరాలు గోప్యంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దాడికి గురైనప్పుడు ఒకరికొకరు రక్షణగా నిలవాలని ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గతంలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు గొడుగు కిందకు తీసుకువస్తుందని పరోక్షంగా సూచించారు.

సౌదీ అరేబియాకు పాకిస్థాన్ దాదాపు 16 విమానాలతో కూడిన పూర్తి స్క్వాడ్రన్‌ను పంపింది. వీటిలో అధిక భాగం చైనాతో కలిసి తయారు చేసిన JF-17 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి ఏప్రిల్ ప్రారంభంలోనే సౌదీకి చేరుకున్నాయని తెలుస్తోంది. అలాగే పాకిస్థాన్ రెండు డ్రోన్ స్క్వాడ్రన్‌లను కూడా మోహరించిందని ఇద్దరు భద్రతా అధికారులు ధృవీకరించారు. ఈ సైనిక మోహరింపులో దాదాపు 8వేల మంది సైనికులు ఉన్నారని, అవసరమైతే మరిన్ని దళాలను పంపేందుకు హామీ ఇచ్చారని సమాచారం. చైనాకు చెందిన HQ-9 వాయు రక్షణ వ్యవస్థ కూడా ఇందులో భాగం. ఈ పరికరాలను పాకిస్థానీ సిబ్బంది నిర్వహిస్తుండగా, సౌదీ అరేబియా ఇందుకయ్యే వ్యయాన్ని భరిస్తుందని వారు వివరించారు. ఇప్పటికే ఇరాన్ దాడులు సౌదీ అరేబియాలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలను దెబ్బతీసి, ఒక పౌరుడి మరణానికి కారణమవడంతో పాకిస్థాన్ వీటిని పంపింది.












Click it and Unblock the Notifications