పెళ్లిళ్లలో సినిమా పాటలు కాపీరైట్ ఉల్లంఘనేనా ? కేంద్రం క్లారిటీ..!
పెళ్లిళ్లలో సినిమా పాటలు పాడటం, ప్రదర్శించడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అయితే ఈ మధ్య ఇంకా ఎక్కువైంది. దీనిపై సినిమా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇలా ఎక్కడ పడితే అక్కడ మా పాటలు పాడుతూ, ప్రదర్శిస్తూ ఉంటే ఇక వాటిని ఎంతో శ్రమకోర్చి రూపొందించిన తమకు ఉపయోగం ఏంటని సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతే కాదు వీటిపై కాపీరైట్ ఉల్లంఘన చట్టాన్ని ప్రయోగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పందించి కాపీరైట్ ఉల్లంఘన చట్టాల బారి నుంచి తమను రక్షించాలని ఆయా ఈవెంట్ల నిర్వాహకులు కోరుతున్నారు. అలాగే అసలు పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో పాటలు పాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా అన్నది కూడా స్పష్టం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై తాజాగా స్పష్టత ఇచ్చింది. పెళ్లిళ్లలో సినిమా పాటల ప్రదర్శన, పాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. వీటిని కోర్టుల్లో సవాల్ చేయలేరని తెలిపింది.

పెళ్లి, ఇతర వేడుకల్లో బాలీవుడ్ పాటలను ప్లే చేయడం వల్ల కాపీరైట్ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వివాహ కార్యక్రమాలలో హిందీ సినిమా పాటల ప్రదర్శన కోసం కాపీరైట్ సొసైటీలు రాయల్టీ వసూలు చేయడంపై అనేక ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ఈ ఆదేశాలు ఇచ్చింది. పబ్లిక్ నోటీసులో డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ మరియు ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) సంగీత రచనల ప్రదర్శన కోసం కాపీరైట్ సొసైటీలు ఆరోపించిన రాయల్టీని వసూలు చేయడంపై సాధారణ ప్రజలు, ఇతరుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని తెలిపింది. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 52 (1) (za) యొక్క స్ఫూర్తికి ఇది విరుద్ధమని తెలిపింది.
కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 52 (1) (za) ప్రత్యేకంగా సాహిత్య, నాటకీయ లేదా సంగీత పరమైన లేదా ఏదైనా మంచి మతపరమైన వేడుక లేదా అధికారిక వేడుకలో ధ్వని రికార్డింగ్ ప్రదర్శన కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్రం తెలిపింది.మతపరమైన వేడుకలలో వివాహ ఊరేగింపు, వివాహానికి సంబంధించిన ఇతర సామాజిక ఉత్సవాలు ఉంటాయని వెల్లడించింది.ఈ నేపథ్యంలో కాపీరైట్ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోకుండా సంబంధిత సొసైటీలకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications