Israel vs Palestine: గాజాపై ఇజ్రాయిల్ దాడి-40 మంది మృతి,మళ్లీ యుద్ధ వాతావరణం..!!
Israel vs Palestine:మంగళవారం ఉదయం గాజా బాంబుల మోతతో నిద్ర లేచింది. గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న ఇజ్రాయిల్ పాలస్తీన సరిహద్దులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తాజాగా పాలస్తీనాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయిల్ చేసిన దాడిలో 40 మంది మృతి చెందగా 60 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని సివిల్ ఎమర్జెన్సీ అధికారులు ధృవీకరించారు. ఖాన్ యూనిస్‌లోని అల్-మవాసి ప్రాంతంలో 20 టెంట్లపై దాడులు జరిగాయి. మంగళవారం ఉదయం ఈ దాడులు జరిగిన సమయంలో ఆ టెంట్లలో మృతులు నిద్రిస్తున్నట్లు సమాచారం.
ఖాన్ యూనిస్‌తో పాటు ఇతర సమీప ప్రాంతాలు అయిన రఫా వద్ద దండయాత్రల సమయంలో ఇజ్రాయిల్ సైన్యం తీర ప్రాంతాన్ని "సేఫ్ జోన్"గా గుర్తించినప్పటి నుండి అల్-మవాసిలో చాలా మంది గుడారాలు వేసుకుని అక్కడ నివసిస్తున్నారు. ఇక ప్రాణాలతో బయటపడ్డ వారికోసం వెతుకుతున్న సమయంలో వారు డేరాలు వేసుకుని నివాసం ఉన్న ప్రాంతంలో భూమికి 30 అడుగుల లోతు వరకు గుంతలు ఉండటాన్నిస్థానికులు గమనించినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. అంతేకాదు ఈ విధ్వంసంకు ముందు ఇజ్రాయిల్‌కు చెందిన విమానాలు గాల్లో చక్కర్లు కొట్టినట్లు వారికి కనిపించాయని వివరించారు.

కొందరు అక్కడ ఇసుకదిన్నెల్లోనే సమాధి కాగా మరికొందరు కనిపించకుండా పోయారని స్థానికులు చెప్పారు. మరికొందరి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడినట్లు చెప్పారు. చాలామంది ఇంకా ఇసుకదిన్నెల్లో చిక్కుకుని ఉన్నారని వీరికోసం అన్వేషణ కొనసాగుతోందని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దుర్మార్గపు చర్యకు పాల్పడిందని గాజా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ దాడులను ఖండిచిన ఆయన అత్యంత పాశవికంగా జరిపిన దాడులుగా అభివర్ణించారు. ఈ దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను కనుగొని బయటకు తీసేందుకు అంబులెన్స్ సిబ్బంది ఇతర సివిల్ ఢిఫెన్స్ సిబ్బంది కష్టపడుతున్నారని వెల్లడించారు.
ఇక ఇజ్రాయిల్ చేసిన ఈ దాడిని పలు దేశాలు ఖండిస్తున్నాయి. అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహాద్ అవాద్ గాజాలో ఇజ్రాయిల్ దాడిని ఖండించారు.ఇజ్రాయిల్ ప్రభుత్వం ఒక హత్యాకాండకు తెరలేపిందని మండిపడ్డారు. బలికి సిద్ధంగా ఉన్న గొర్రెల్లాగా పాలస్తీన ప్రజలను ఇజ్రాయిల్ చూస్తోందని వారిని మనుషుల్లాగా చూడటంలేదని వారికి స్వేచ్ఛ జీవితం అంటూ ఒకటి ఉంటుందని అన్నారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ అధికారులు మాత్రం భిన్న వాదనను వినిపిస్తున్నారు. సురక్షిత ప్రాంతమైన ఖాన్ యూనిస్‌లో కొందరు హమాస్ ఉగ్రవాదులు తిష్ట వేసి అక్కడే కమాండ్ మరియు కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆపరేట్ చేస్తున్నారని అన్నారు.దాడులు నిర్వహించేందుకు ముందే సామాన్య పౌరులకు హానీ తలపెట్టకుండా ఉగ్రవాదులే లక్ష్యంగా అటాక్ చేయాలని భావించినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ ఎక్స్ పై పోస్ట్ చేసింది.
At least 40 people have been killed and dozens injured in Israeli strikes on a designated humanitarian zone in southern Gaza. Large craters were left at the site as rescuers searched for survivors. #Gaza #Israel #KhanYounis pic.twitter.com/SQEDp58Nun
— British Pakistani Index (@PakistaniIndex) September 10, 2024
గాజాను పాలిస్తున్న పాలస్తీన గ్రూప్‌కు చెందిన హమాస్ ఇజ్రాయిల్ వాదనను కొట్టిపారేసింది. ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిన ప్రాంతంలో తమ సైనికులు లేరని హమాస్ స్పష్టం చేసింది. వారు పాల్పడిన ఈ దుశ్చర్యను సమర్థించుకునేందుకే హమాస్‌కు చెందిన వారు అక్కడున్నారంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడింది. అంతేకాదు సాధారణ పౌరులు ఎక్కడైతే ఉంటారో లేదా వారు నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారో అక్కడ హమాస్‌కు చెందిన వారు ఉండరని ఆ ప్రాంతాన్ని మిలటరీ కార్యక్రమాలకు వినియోగించుకోమని హమాస్ సంస్థ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications