యూరోపియన్ పార్లమెంట్‌పై మండిపడ్డ భారత్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పర్యటిస్తోన్నారు. ఆ దేశ ప్రధానితో సమావేశం అయ్యారు. దేశాధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్‌నూ కలుసుకోనున్నారు. ప్రతిష్ఠాత్మకమైన బాస్టిల్ డే సెలబ్రేషన్స్‌కు గౌరవ అతిథిగా హాజరు కాబోతోన్నారు. 90,000 కోట్ల రూపాయల విలువ చేసే రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో- యూరోపియన్ పార్లమెంట్ కీలక తీర్మానానికి ఆమోదం తెలిపింది. రెండు నెలలకు పైగా మణిపూర్‌లో చెలరేగుతూ వస్తోన్న హింసాత్మక పరిస్థితులను వ్యతిరేకిస్తూ రూపొందించిన తీర్మానం అది. దాన్ని హడావుడీగా ఆమోదించింది. దీనికోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ప్లీనరీ సెషన్‌ను నిర్వహించింది.
మణిపూర్‌లో జాతుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ, హింసాత్మక పరిస్థితులు.. మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించింది యూరోపియన్ పార్లమెంట్. భారత ప్రభుత్వం తక్షణమే మణిపూర్ హింసను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, జాతుల మధ్య వైషమ్యాలను నివారించాలని తీర్మానించింది.
అక్కడితో ఆగలేదు.. యూరోపియన్ పార్లమెంట్. మణిపూర్ హింసపై సమగ్ర దర్యాప్తును జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. స్వతంత్రంగా పని చేసే ప్యానెల్‌ను దీనికోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తు జరగాల్సిన ఉంటుందని పేర్కొంది. విధ్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను సైతం తక్షణమే నిలిపివేయాలని సూచించింది.
యూరోపియన్ పార్లమెంట్ చేసిన ఈ తీర్మానంపై భారత్.. వెంటనే స్పందించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేశారు. మణిపూర్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై యూరోపియన్ పార్లమెంట్ అత్యవసర చర్చను నిర్వహించడం, ఓ తీర్మానాన్ని ఆమోదించడం తమ దృష్టికి వచ్చిందని అన్నారు.

ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదని బాగ్చీ స్పష్టం చేశారు. మణిపూర్ పరిణామాలు.. పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని గుర్తు చేశారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆమోద యోగ్యం కాదని చెప్పారు. యూరోపియన్ పార్లమెంట్ చేసిన తీర్మానం.. వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. తమ దేశ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారిస్తే మంచిదని సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications