ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి మరోసారి భరోసా
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి- రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దీనితో పాటు ప్రతి ఇంటికీ ప్రతినెలా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ప్రతి మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల నగదు బదిలీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 10 కేజీల ఉచిత బియ్యం.. వంటివి ఉన్నాయి.
వాటని తన మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- ఆయా హామీలను అమలు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు. తొలి కేబినెట్‌లోనే ఆ ఫైళ్లను క్లియర్ చేశారు. వాటిని అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనపై కేఎస్ఆర్టీసీ సహా సంబంధిత శాఖల అధికారులు కసరత్తు చేస్తోన్నారు. అవి కొలిక్కి రాగానే అమలు చేస్తామని చెబుతున్నారు.

ఇదే విషయాన్ని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించాల్సిన ఉచిత ప్రయాణంపై ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు విధించకుండా వంద శాతం అమలు చేస్తామని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ఈ మార్గదర్శకాలను ఖరారు చేస్తామని వివరించారు.
బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ అయిదు హామీలపై ఇందులో చర్చించనున్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే సిద్ధరామయ్య- ఆయా హామీలకు సంబంధించిన ప్రతిపాదనలను అమలు చేయడానికి పచ్చజెండా ఊపిన నేపథ్యంలో- ఈ 10 రోజుల పాటు ఆయా శాఖల అధికారులు మార్గదర్శకాలపై కసరత్తు చేశారు. పూర్తి నివేదికలను మంత్రులకు అందజేశారు.
బుధవారం జరిగే కేబినెట్‌లో ఈ నివేదికలు చర్చకు రానున్నాయి. మార్గదర్శకాల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని సవరించడం, ఆయా హామీల అమలుకు అయ్యే ఖర్చు గురించి బేరీజు వేసుకోవడం.. వంటి అంశాలపై సమగ్రంగా చర్చించిన అనంతరం- అమలు తేదీని మంత్రివర్గం ప్రకటిస్తుంది. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని జూన్ 1వ తేదీ నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications