తృణమూల్ కాంగ్రెస్ పై పిడుగుపాటు
పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీ పోలింగ్ లో తృణమూల్ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఎల్లుండి.. అంటే మే 21వ తేదీన ఈ రీపోలింగ్ జరగాల్సి ఉంది. సరిగ్గా రెండు రోజుల ముందు జహంగీర్ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు. పోటీ చేయట్లేదని ప్రకటించారు. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ లో ఉలిక్కిపడింది.
కిందటి నెల పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న మలి విడతలో ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. అక్కడ చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల వల్ల మొత్తం పోలింగ్ ను రద్దు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈవీఎం బటన్లను తారుమారు చేయడం, పోలింగ్ సమయంలో అంతరాయాలు వంటి అనేక కీలక అక్రమాల ఆరోపణల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 21వ తేదీన రీ పోలింగ్ నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ ఓడిపోవడం, బీజేపీ గెలవడం, సువేందు అధికారి ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. ఫాల్తా నియోజకవర్గం రీపోలింగ్ గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో జహంగీర్ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడం ఆ పార్టీకి పిడుగుపాటు.
తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంపై జహంగీర్ స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫాల్తా నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తోన్నారని, నూతన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారని, బీజేపీ అనాయాసంగా గెలిచే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. తాను పోటీ చేసినా, గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండబోదని పేర్కొన్నారు. సువేందు అధికారి ప్రభుత్వంలో ఫాల్తా నియోజకవర్గానికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
జహంగీర్ నిష్క్రమణతో బీజేపీకి ఎదురు ఉండకపోవచ్చు. గట్టి పోటీ ఇచ్చే పార్టీ అక్కడ లేకపోవడంతో గెలుపు నల్లేరు మీద నడకే. రీపోలింగ్ ఈ నెల 21న జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 24న చేపట్టనున్నారు. ఫాల్తా.. తృణమూల్ కాంగ్రెస్‌కు కంచు కోట. అభిషేక్ బెనర్జీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఎన్నికల సమయంలోనే దీనిపై అంది చూపూ నిలిచింది.












Click it and Unblock the Notifications