అయోధ్య తీర్పుపై జమాతె ఉలేమా హింద్ సంచలనం: ఊహించని విధంగా..!
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై క్రమంగా ముస్లిం సంఘాలు ఒక్కటవుతున్నాయి. ఒక్కటొక్కటిగా పునఃసమీక్షను కోరుతున్నాయి. అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పునఃసమీక్షకు వెళ్లాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే నిర్ణయం తీసుకుంది. తాజాగా- మరో ముస్లిం సంఘం కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసింది కూడా.

రివ్యూ పిటీషన్ దాఖలు చేసిన జమాతె ఉలేమా..
జమాతె ఉలేమా-ఇ-హింద్ సోమవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయాలని కొద్దిరోజుల కిందటే జమాతె ఉలేమా-ఇ-హింద్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా- జమాతె ఉలేమా జాతీయ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని సారథ్యంలో అయిదు సభ్యులు గల ప్యానెల్ కమిటీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసింది.

రామ్ లల్లాకు అనుకూలంగా తీర్పు..
అయిదు శతాబ్దాలుగా వివాదానికి కేంద్రబిందువుగా ఉంటూ వచ్చిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు.. హిందూ సంఘాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమి రామ్ లల్లా విరాజ్ మాన్ కు చెందుతుందంటూ కిందటి నెల 9వ తేదీన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.

మొదట్లో స్వాగతించి.. ఇప్పుడు రివ్యూ కోసం
దీనిపై మొదట్లో అసంతృప్తిని వ్యక్తం చేసిన ముస్లిం సంఘాలు.. క్రమంగా సర్దుకున్నాయి. తీర్పును స్వాగతించాయి. రివ్యూ పిటీషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ముస్లిం సంఘాల ప్రతినిధుల వైఖరిలో మార్పులు కనిపిస్తున్నాయి. తొలుత- రివ్యూ పిటీషన్ వేయకూడదని నిర్ణయించిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు.. ఆ తరువాత పునఃసమీక్షకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నెల రెండో వారంలో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయనుంది.

సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు.. పాత నిర్ణయానికి కట్టుబడి
అదే సమయంలో- జమాతె ఉలేమా-ఇ-హింద్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. రివ్యూకు వెళ్లింది. ఈ మేరకు రివ్యూ పిటీషన్ ను కూడా దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా జమాతే ఉలేమా ప్రకటించాల్సి ఉంది. ఈ భూవివాద కేసులో ప్రధాన కక్షిదారుగా ఉంటూ వచ్చిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. పునఃసమీక్షకు వెళ్లకూడదని తీర్మానించింది. దీనికి అనుగుణంగా.. తాము భవిష్యత్తులో రివ్యూకు వెళ్లబోమని స్పష్టం చేసింది.

వక్ఫ్ బోర్డు వెనుకంజ వేయడంతో..
వివాదాస్పద భూమికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించదలిచిన అయిదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలని, అందులో ఓ మసీదుతో పాటు ఓ ముస్లిం యూనివర్శిటీని కూడా కట్టాలని తీర్మానించిన విషయం తెలిసిందే. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు తన నిర్ణయాన్ని వెల్లడించిన తరువాతే.. ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాతె ఉలేమా సంఘాలు ముందుకొచ్చాయి. పునఃసమీక్షకు వెళ్లబోతున్నాయి.












Click it and Unblock the Notifications