మళ్లీ రానున్న లండన్ డాక్టర్: ఆసుపత్రిలో జయ పక్కనే శశికళ!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ప్రతిరోజు బులెటిన్ విడుదల చేస్తున్నారు. మంగళవారం కూడా జయకు కొంతసేపు వెంటిలెటర్ తొలగించారని తెలుస్తోంది.
జయలలితకు ప్రత్యేక వైద్యం అందిస్తున్న లండన్ వైద్యులు డాక్టర్ బాలే మళ్లీ గురువారం లేదా శుక్రవారం చెన్నైకి రావొచ్చునని అంటున్నారు. ఆయన సూచనల మేరకు వైద్య సాయం అందిస్తున్నారు. అత్యవసరం అయితే మళ్లీ వస్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ రానున్నారని తెలుస్తోంది.

అపోలో వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఎవరినీ ఆమెను చూసేందుకు అనుమతించడం లేదు. చాలామంది జయకు చికిత్స అందిస్తున్న రెండో అంతస్తు వరకు వెళ్లి అక్కడి ముఖ్య నేతలను కలిసి వస్తున్నారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
మరోవైపు, జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ జయ పక్కనే ఉంటూ ఆమెకు సపర్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ వ్యవహారాలను ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణణ్‌లు ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కావేరీ జల వివాదంపై కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు లేఖ రాశారు. తద్వారా జయ అనారోగ్యం కారణంగా పాలనకు ఎలాంటి ఇబ్బందులు లేవనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications