జయలలితపై వ్యాఖ్య: తమిళనాడు అసెంబ్లీలో 'ముష్టియుద్ధం'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గురువారం ప్రతిపక్ష డిఎండికె ఉపనాయకుడు అన్నా డిఎంకె అధినేత్రి జయలలితనుద్దేశించి చేసిన వ్యాఖ్య తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అసెంబ్లీ కారిడార్‌లో మార్షల్స్‌పై కూమా చేయి చేసుకున్నారు. చివరికి డిఎండికె ఎమ్మెల్యేలనందరినీ స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష ఉప నాయకుడు, డిఎండికె శాసన సభ్యుడు ఆర్ మోహన్ రాజ్ అన్నా డిఎంకె అధినేత్రి జయలలిత పేరు ప్రస్తావింకుండా ఆమెకు వర్తించే విధంగా చేసిన వ్యాఖ్య గొడవకు దారి తీసింది.
తమ నాయకురాలిని అవమానించే రీతిలో మోహన్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు అధికార అన్నాడిఎంకె సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మోహన్ రాజ్‌పై తగిన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి ఒ పన్నీర్ సెల్వం సహా పలువురు అదికార పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. డిఎండికె అధ్యక్షుడు విజయకాంత్‌పై అన్నాడిఎంకె ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా మోహన్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేసారు. తమ నాయకుడిని అవమానపరిచే విధంగా అన్నా డిఎంకె ఎమ్మెల్యే వ్యాఖ్యలున్నాయని డిఎండికె సభ్యులు భావించారు.

మోహన్ రాజ్ చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ధన్‌పాల్ సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నందుకు ఆయనను బయటికి పంపించేయాలని ఆదేశించారు. అయితే దీనికి తీవ్ర అభ్యతరం చెప్పిన డిఎండికె ఎమ్మెల్యేలు పార్టీ విప్ చంద్రకుమార్ నేతృత్వంలో స్పీకర్ పోడియం వద్దకు చేరి ఆయనతో వాగ్వివాదానికి దిగారు. ఈ గొడవలో స్పీకర్ పోడియం ముందుకు జరగడం, కొంతమేరకు ధ్వంసం కావడం, మైకులు లాగేయడం, అడ్డుకోబోయిన మార్షల్స్ టోపీలను గాలిలోకి విసిరేయడం చేశారు. దీంతో డిఎండికె సభ్యులను మార్షల్స్ బలవంతంగా సభలోంచి బయటకు తీసుకెళ్తుండగా కారిడార్‌లో కొంతమంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు వారిపై దాడి చేసి కొట్టారు.
ఈ సంఘటనను తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా స్పీకర్ ధన్‌పాల్ అభివర్ణించారు. డిఎండికె సభ్యులందరినీ ప్రస్తుత సమావేశాలు ముగిసే దాకా సస్పెండ్ చేసే తీర్మానాన్ని సభా నాయకుడు, విద్యుత్ శాఖ మంత్రి నాథం ఆర్ విశ్వనాథన్ ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదించారు. అంతేకాకుండా ఈ వ్యవహరాన్ని హక్కుల కమిటీకి నివేదించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications