జైల్లో జయలలిత, గందరగోళం: సంబరాలు, అంతలోనే...
చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ రాకపోవడంతో ఆ పార్టీ వర్గాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. కొద్ది క్షణాల ముందు సంబరాలు చేసుకున్న అభిమాలను.. అంతలోనే కంటతడి పెట్టారు. జయలలితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఆమెకు బెయిల్ వచ్చినట్లుగా అందరూ భావించారు. కానీ అంతలోనే హైకోర్టు ఆమెకు బెయిల్ తిరస్కరించింది.
దీంతో అప్పటిదాకా సంబరాలు చేసుకున్న అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జయకు బెయిల్ వచ్చిందని మొదట వార్తలు రావడంతో అభిమానుల సంబరం అంబరాన్ని అంటింది. బాణసంచాను పేల్చారు. డ్యాన్సులు చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తల కోలాహలం వెల్లివిరిసింది. మిఠాయిలు పంచుకున్నారు. అయితే, అంతలోనే కోర్టు బెయిల్ నిరాకరించిందని తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు.

జయ బెయిల్ విషయంలో గందరగోళం
ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో జయలలిత బెయిల్ పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ షరతులతో కూడిన బెయిల్‌కు వ్యతిరేకించక పోవడంతో.. కోర్టు ఉత్తర్వులు రాకముందే బెయిల్ వచ్చిందని అందరు భావించారు. దీంతో మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రసారం చేశాయి.
అంతలోనే బెయిల్ రాలేదని తెలియడంతో అందరు అవాక్కయ్యారు. అయితే, ఈ వ్యవహారంలో తమిళ మీడియా కారణంగానే ఈ గందరగోళం చెలరేగిందని అంటున్నారు. జయలలితకు బెయిల్ రావాలని అన్నాడీఎంకే అభిమానులు, కార్యకర్తలు పూజలు చేశారు.. పాదయాత్రలు చేశారు.. కానీ వారి మొక్కులు ఫలించలేదు.












Click it and Unblock the Notifications