Jenabai Daruwali: ముంబై అండర్‌వరల్డ్‌లో తొలి మహిళా క్వీన్.. దావూద్‌కు తల్లిలా మారిన మాఫియా రాణి!
Jenabai Daruwali: దేశంలోని మహానగరమైన ముంబైకి గొప్ప చరిత్ర ఉంది. ఈ మహానగరం రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక రంగాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ.. నేరాలతో కూడిన రక్తిసిక్తమైన చరిత్ర కూడా ఉంది. గతంలో ముంబై మత అల్లర్లు, ఉగ్రవాద దాడుల నుంచి స్మగ్లర్లకు కేంద్రంగా మారడం వరకు ఎన్నో కష్టాలను చవిచూసింది. అయినప్పటికీ ముంబై సాధారణ ప్రజలకు చాలా సురక్షితమైన ప్రదేశంగా మారింది. ఈ పరివర్తనలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. అయితే ముంబై నేర ప్రపంచంలో దావూద్ ఇబ్రహీం 'డాన్' గా అపఖ్యాతి పాలయ్యాడు.అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎవరి మాట వినకపోయినా ఒక మహిళ మాట వినేవాడట. దావూద్ తన తల్లిదండ్రుల మాట వినకపోయినా, ఆమె మాట మాత్రం ఖచ్చితంగా వినేవాడు. ఆ మహిళ ముంబైలోని మద్యం మాఫియాకు నాయకురాలు. ఆమె పేరు జెనాబాయి దారువాలి. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ కథనంలో మా ఉద్దేశం నేరాన్ని ప్రోత్సహించడం ఎంతమాత్రం కాదండోయ్.. ప్రజలు తెలుసుకోవాల్సిన ముంబై చరిత్రలోని సంఘటనల గురించి సమాచారాన్ని పంచుకోవడమే మా అసలైన ఉద్దేశం. సీనియర్ జర్నలిస్ట్ ఎస్. హుస్సేన్ జైదీ రాసిన "మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై" అనే పుస్తకం ఆధారంగా దావూద్ తన తల్లిగా భావించిన జెనాబాయి దారువాలి కథ వెలుగులోకి వచ్చింది. అసలు ఈ జెనాబాయి దారువాలి ఎవరనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఈ జెనాబాయి ఎవరు?
జెనాబాయిగా ప్రసిద్ధి చెందిన జైనాబ్.. ముంబై మాఫియా మహిళల మధ్య తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న మొదటి మహిళ. చరిత్ర ఆమెను చాలా కుయుక్తిగల మహిళగా వర్ణిస్తుంది. జెనాబాయి 1920లో ఒక ముస్లిం మెమన్ హలాయ్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి విక్టోరియా కారును నడిపేవారు, అదే వారి కుటుంబానికి ఏకైక ఆదాయ వనరు. జెనాబాయి ఆరుగురు తోబుట్టువులలో ఒకరు. 1920లు, 1930లలో ఆ కుటుంబం మొత్తం ముంబైలోని డోంగ్రీలో ఉన్న మహమ్మద్ అలీ రోడ్డులోని ఒక గల్లీలో ఒకే గదిలో నివసించేది.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న జెనాబాయి
జెనాబాయి కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని చెబుతారు. ఆమె మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుదారురాలు అని జర్నలిస్ట్ ఎస్. హుస్సేన్ జైదీ జైదీ తన పుస్తకంలో రాశారు. జెనాబాయికి 14 ఏళ్ల వయసులో మహమ్మద్ షా దర్వేష్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత, ఆమె డోంగ్రీలోని చునావాలా బిల్డింగ్‌కు మారారు. ఆమె భర్త దర్వేష్ ఓ చిన్న కలప వ్యాపారాన్ని నడిపేవారు. జెనాబాయికి దర్వేష్‌తో ఖదీజా, ఇక్బాల్, సలీం, కమల్, షమ్మీ అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం, బ్రిటిష్ వారు 'విభజించి పాలించు' అనే విధానాన్ని అవలంబించి హిందూ-ముస్లిం అల్లర్లను ప్రేరేపించారు. ఆ రోజుల్లో జెనాబాయి హిందువులను రక్షించారు, అయినప్పటికీ అలా చేసినందుకు ఆమె తరచుగా తన భర్త చేతిలో దెబ్బలు తిన్నారు.
దేశ విభజన తర్వాత పాకిస్థాన్ వెళ్లిపోయిన భర్త
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, అవిభక్త భారత్ రెండు భాగాలుగా విడిపోయింది. జెనబాయి భర్త దర్వేష్ పాకిస్థాన్‌కు వలస వెళ్ళిపోయారు. తనతో పాటు రమ్మని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఆమె నిరాకరించింది. ఆమె తన ఐదుగురు పిల్లలతో ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకుంది.
మొదట బియ్యం వ్యాపారిగా పేరు సంపాదించి జెనాబాయి
స్వాతంత్ర్యం తర్వాత ముంబైలో ధాన్యం, బియ్యం కొరత ఏర్పడింది. తన కుటుంబాన్ని పోషించడానికి, జెనాబాయి త్వరగా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొన్నారు. ఆమె టోకు ధాన్యం వ్యాపారులకు, నల్లబజారులో అధిక ధరలకు ధాన్యం అమ్మే దుకాణదారులకు మధ్యవర్తిగా వ్యవహరించారు. లైసెన్సు లేకుండా ధాన్యాన్ని నిల్వ చేయడం, అమ్మడం నేరం. అయినప్పటికీ, జెనాబాయి ఈ పనిని కొనసాగించారు. ఆసక్తికరంగా పోలీసులు చునావాలాలోని ఆమె ఇంటిపై తరచుగా దాడులు చేసేవారు.కానీ ఆమెపై అధికారికంగా కేసు నమోదు చేయడానికి తగిన సాక్ష్యాలు వారికి ఎప్పుడూ లభించలేదు. మన్ వర్గానికి చెందినది కావడం వల్ల, జెనాబాయి అనర్గళంగా గుజరాతీ మాట్లాడేది. చాలామంది ధాన్యం వ్యాపారులు, దుకాణదారులు కూడా గుజరాతీలే కావడంతో, ఆమెతో వ్యాపారం చేయడం సులభమయ్యేది. అంతేకాకుండా, ఆమె బియ్యం వ్యాపారం వల్ల ఆమెకు "జెనాబాయి చావల్వాలీ" అనే మారుపేరు వచ్చింది.
జెనాబాయి, వరదరాజన్ ముదలియార్
సుమారు 1950లో ఆమె ఇక్బాల్ గాంధీ అనే వ్యక్తిని కలుసుకున్నారు. జెనాబాయి ఇక్బాల్ గాంధీని రెండో వివాహం చేసుకుంది. ఆమె తన ధాన్యం వ్యాపారాన్ని కొనసాగించింది, కానీ దాని నుంచి చాలా తక్కువ ఆదాయం వచ్చేది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సమీపంలోని బిస్మిల్లా షాబాబా పాత మందిరం వద్ద వరదరాజన్ ముదలియార్ అనే వ్యక్తి పేదలకు దానధర్మాలు చేస్తున్నాడని ఆమె తెలుసుకుంది. జెనాబాయి వరదరాజన్‌ను కలిసి తన దయనీయమైన ఆర్థిక పరిస్థితి గురించి ఆయనకు చెప్పింది. ఆ సమయంలో ముంబైలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. వరదరాజన్ సహచరులు అక్కడ మద్యం తయారీలో నిమగ్నమై ఉన్నారు. వరదరాజన్‌కు కూడా సహాయం అవసరమైంది. అతను జెనాబాయికి మద్యం అమ్మమని సూచించాడు. మొదట ఆమె నిరాకరించినా, తర్వాత అంగీకరించింది. జెనాబాయి సహాయంతో, వరద పెద్ద మొత్తంలో మద్యం అమ్మాడు. ఆ తర్వాత వరదరాజన్ హాజీ మస్తాన్, కరీం లాలాలతో స్నేహం చేయగా.. అతను జెనాబాయిని వారికి పరిచయం చేశారు.
దావూద్ కుటుంబంతో ఉన్న సంబంధాలు
మద్యం వ్యాపారం ద్వారా భారీగా సంపదను సంపాదించింది. అంతేకాకుండా వరదరాజన్, కరీం లాలా, మస్తాన్‌లతో ఆమెకున్న బలమైన సంబంధాలు ముంబై మాఫియాలో ఆమెకు బలమైన పేరు, పలుకుబడిని సంపాదించిపెట్టాయి. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లతో ఆమెకున్న సంబంధాల వల్ల క్రమంగా ఆమె పోలీసులతో మంచి సంబంధాలు పెంచుకుని పోలీసు ఇన్ఫార్మర్‌గా మారింది. ఈ సమయంలో ఆమెకు పోలీస్ కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్, అతని భార్య అమీనాతో పరిచయం ఏర్పడింది. వారి బంధం ఎంత బలపడిందంటే వారు ఒక కుటుంబంలా మారిపోయారు. డాన్ దావూద్ ఇబ్రహీం ఆ కానిస్టేబుల్ కొడుకు కావడం గమనార్హం. దావూద్‌తో ఆమె సంబంధం చాలా సన్నిహితంగా, ప్రేమగా ఉండేది.. దావూద్ ఆమెను తన తల్లిలా భావించేవాడు.
1962లో జెనాబాయి ఇంటిపై దాడి
1962లో జెనాబాయి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆమె ఇంట్లోని ఓ వాటర్ ట్యాంకులో మద్యం దొరికింది. ఆ తర్వాతా జెనాబాయిని అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్‌ను ఆమె కలిసినట్లు వార్తలు వచ్చాయి. తన పేదరికాన్ని కారణంగా చూపుతూ, పరిస్థితులు తనను అలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎలా పురికొల్పాయో ఆమె వివరించారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు సమాచారం అందించే ఇన్‌ఫార్మర్‌గా మారారు.
దావూద్‌ను కాపాడిన జెనాబాయి
ఆ సమయంలో దావూద్ ఓ యువకుడు, ఒక ముఠా నాయకుడు. అతని తండ్రి పోలీస్ కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్. అతని గొడవలు, గూండాయిజం వల్ల తండ్రి తీవ్రంగా కలత చెందారు. అతని చర్యలు తరచుగా ఆయనకు ఇబ్బందిని కలిగించేవి. ఒకసారి దావూద్ మనీష్ మార్కెట్ గ్యాంగ్‌స్టర్ హమీద్ చుహాతో గొడవకు దిగాడు. చుహా తీవ్రంగా గాయపడటంతో అతడిని ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. ఇబ్రహీం కస్కర్ తన కొడుకుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దావూద్ ఇబ్రహీం వారం రోజుల పాటు ఇంటికి దూరంగా ఉన్నాడు. అయితే ఈ విషయంలో జెనాబాయి జోక్యం చేసుకున్నారు. ఇబ్రహీం కాస్కర్, అమీనాలను ఒప్పించి పోలీసు అధికారులతో కూడా మాట్లాడింది. ఆమె సహాయంతో దావూద్ ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకే దావూద్ ఆమె మాట వింటాడు.
నేరస్థులను ఏకం చేసిన జెనాబాయి
దావూద్ ఇబ్రహీంకు, అతనికి వైరం ఉన్న ముస్లిం ముఠాల సభ్యులకు మధ్య జెనాబాయి మధ్యవర్తిత్వం వహించి.. వారితో స్నేహం చేసేలా ఒప్పించింది. ఆమె దావూద్, హాజీ మస్తాన్, కరీం లాలాలను కలిసేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. జెనాబాయి చేసిన ప్రయత్నాల వల్ల, కరీం లాలా (పఠాన్ ముఠా నాయకుడు), అతని అనుచరులైన దావూద్, సాబిర్, మజీద్ కాలియా, హుస్సేన్ సోంజీ, దిలీప్ అజీజ్, హనీఫ్‌లు ఏకమయ్యారు. ఆ తర్వాత వారంతా నేర ప్రపంచంలో కలిసి పనిచేశారు.













Click it and Unblock the Notifications