విచారణకు అక్కర్లేదు-నేరుగా అరెస్టు చేసుకోండి- ఈడీకి హేమంత్ సోరెన్ సవాల్
బొగ్గు స్కామ్ లో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మండిపడ్డారు. ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. సోరెన్ వెళ్లలేదు. దానికి బదులుగా కార్యకర్తలతో భేటీ ఏర్పాటు చేసి ఈడీపై విమర్శలు గుప్పించారు.
తాను దోషి అయితే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీకు వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీకి సవాల్ చేసారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనకు సమన్లు పంపడం ఓ గిరిజన ముఖ్యమంత్రిని వేధించే కుట్రలో భాగమని సోరెన్ అభివర్ణించారు. అధికార బిజెపిని వ్యతిరేకించే గొంతుల్ని అణిచివేసే ప్రయత్నమని, ఇది రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడమేననిసోరెన్ ఆరోపించారు. బొగ్గు గనుల స్కామ్ లో డబ్బును లాండరింగ్ చేశారనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపణపై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సోరెన్ మాట్లాడారు. ఈ కుట్రకు తగిన జవాబు లభిస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇవాళ రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలని ఆయన్ను కోరినా హాజరుకాలేదు. కానీ తన ఇంటి బయట జేఎంఎం కార్యకర్తలను ఉద్దేశించి సోరెన్ ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలతో బిజీగా ఉంటూ, పారిపోయిన వ్యాపారులను విడిచిపెట్టిందని సోరెన్ ఆరోపించారు. అంతకు ముందు ట్విట్టర్‌లో బీజేపీ పేరెత్తకుండానే నన్ను వేధించే ప్రయత్నం వెనుక గిరిజనులు, వెనుకబడిన కులాలు, మైనారిటీల హక్కులను అడ్డుకోవడమే లక్ష్యముందని ఆరోపించారు. రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మద్దతు తనకు ఉంది కాబట్టి వారి కుట్రలు ఏవీ ఫలించవన్నారు.












Click it and Unblock the Notifications