JN.1 Virus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు-నిపుణుల హెచ్చరికలు..!
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్1 కేసులు మళ్లీ ఆందోళన పెంచుతున్నాయి. గతంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో తలెత్తిన పరిస్ధితుల్ని మళ్లీ గుర్తుచేసేలా జేఎన్1 వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో నిపుణులు కూడా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, రోగులు భారీ సంఖ్యలో ఆస్పత్రులకు పోటెత్తడం ఖాయమనే హెచ్చరికలు చేస్తున్నారు. ఒమిక్రాన్ ఉపరకమైన జేఎన్1 ప్రభావం తక్కువేనని భావించినా ఆ పరిస్ధితి లేదని తాజా పరిస్ధితులు చెప్తున్నాయి.
గతంలో దేశాన్ని ఒమిక్రాన్ వైరస్ కేసులు కుదిపేసిన ఏడాదిన్నర విరామం తర్వాత ఇప్పుడు దాని ఉపరకం జేఎన్1 కేసుల్లో కనిపిస్తున్న పెరుగుదల పాత రోజులను మరోసారి గుర్తుచేస్తోంది. దీనిపై నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తాజాగా జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా కొచ్చిలో ఇన్‌ఫ్లుఎంజా లాంటి వైరస్ తో బాధపడుతున్న రోగులలో 30 శాతం మంది 24 గంటల్లోనే కోవిడ్ పాజిటివ్‌గా మారారని తెలిపారు. వీరి నుంచి ఇతరులకు కూడా వైరస్ వ్యాపించిందన్నారు.

అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) మాజీ ఛీఫ్ సైంటిస్ట్ అయిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కూడా ఎన్డీటీవీతో మాట్లాడుతూ కోవిడ్‌ను సాధారణ జలుబుగా కొట్టిపారేయవద్దనిహెచ్చరించారు. తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే వ్యక్తుల వల్ల మాత్రమే కాదు, వ్యాధి యొక్క దీర్ఘకాలిక ప్రభావాల వల్ల ప్రమాదం పెరుగుతోందన్నారు. గుండెపోట్లు, స్ట్రోకులు, మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
అయితే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా గతంలో వ్యాక్సిన్లు వేయించుకుని ఉండటం వల్ల ఆస్పత్రుల పాలయ్యే వారి సంఖ్య కాస్త మారొచ్చని వీరిద్దరూ తెలిపారు. ఎందుకంటే 2020లో దేశంలో కరోనా వైరస్ వచ్చే నాటికి ఇప్పటికీ ఆరోగ్య వ్యవస్ధల్లో చాలా మార్పులు వచ్చాయని, కాబట్టి కేసుల్ని తట్టుకునే స్ధితిలో మన దేశం ఉండొచ్చన్నారు. అయితే ఇప్పటికీ వృద్ధులు, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వారు మాస్కులు తప్పనిసరిగా వాడాలని సౌమ్యా స్వామినాథన్ సూచించారు. మరోవైపు దేశంలో జేఎన్1 వైరస్ కేసుల సంఖ్య 21కి పెరిగింది. అయితే ఈ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.












Click it and Unblock the Notifications