• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్గిల్ యుద్ధం: "నా శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్‌ సైన్యం మీదకు గ్రెనేడ్ విసిరా" - యోగేంద్ర సింగ్ యాదవ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అది 1999, జులై 3. టైగర్ హిల్‌పై మంచు కురుస్తోంది. రాత్రి తొమ్మిదిన్నరకు ఆప్స్ రూంలో ఫోన్ మోగింది.

కోర్ కమాండర్ జనరల్ కిషన్ పాల్.. మేజర్ జనరల్ మొహిందర్ పురీతో వెంటనే మాట్లాడాలంటున్నారని ఆపరేటర్ చెప్పాడు.

ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు మాటలు నడిచాయి. తర్వాత, 56 మౌంటెన్ బ్రిగేడ్ డిప్యూటీ కమాండర్ ఎస్‌వీఈ డేవిడ్‌తో "టీవీ రిపోర్టర్ బర్ఖా దత్, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారా, టైగర్ హిల్‌పై జరుగుతున్న కాల్పులపై ఆమె లైవ్ కామెంట్రీ ఇస్తోందా?" అని పురీ అడిగారు.

లెఫ్టినెంట్ జనరల్ మొహిందర్ పురీ ఆరోజును గుర్తు చేసుకున్నారు. "బర్ఖా దత్ టైగర్ హిల్‌పై మా అటాక్ గురించి లైవ్ కామెంట్రీ ఇస్తున్నారని తెలీగానే, నేను ఆమె దగ్గరకు వెళ్లి.. దీన్ని తక్షణం ఆపేయండి, పాకిస్తానీలకు ఇది తెలియాలని మేం అనుకోవడం లేదు" అన్నాను.

"నేను ఆ అటాక్ గురించి మా కోర్ కమాండర్‌కు మాత్రమే చెప్పాను. ఆయన ఆ విషయం ఆర్మీ చీఫ్‌కు కూడా చెప్పలేదు. ఇంత సున్నితమైన ఈ ఆపరేషన్ గురించి బర్ఖా దత్ లైవ్ కామెంట్రీ ఎలా చేస్తోందా? అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది" అని పురీ చెప్పారు.

యోగేంద్ర సింగ్ యాదవ్

టైగర్ హిల్‌పై భారత జెండా

టైగర్ హిల్‌ను స్వాధీనం చేసుకున్నామని జులై 4న అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ప్రకటించారు. అప్పటివరకూ భారత సైన్యం దానిని పూర్తిగా ఆక్రమించలేదు.

కానీ, టైగర్ హిల్ శిఖరం అప్పటికీ పాకిస్తాన్ సైన్యం ఆక్రమణలోనే ఉంది. ఆ సమయంలో భారత సైన్యంలోని సాహసికులైన ఇద్దరు యువ ఆఫీసర్లు లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్, కెప్టెన్ సచిన్ నింబాల్కర్ టైగర్ హిల్ శిఖరం నుంచి పాకిస్తాన్ సైనికులను తరిమికొట్టేవరకూ వెనక్కి తగ్గేది లేదంటూ ముందుకెళ్లారు.

వాళ్లు శిఖరానికి ఇంకా 50 మీటర్లు కిందే ఉన్నారు. ఆలోపే "దే ఆర్ షార్ట్ ఆఫ్ ద టాప్" అని బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్‌కు ఒక మెసేజ్ వెళ్లింది.

శ్రీనగర్ నుంచి ఉధంపూర్ మీదుగా దిల్లీ చేరేసరికే ఆ మెసేజ్ భాష మారిపోయింది. వారికి "దే ఆర్ ఆన్ ద టైగర్ టాప్" అని అర్థమైంది. అదే సందేశం పంజాబ్‌లోని ఒక బహిరంగసభలో ప్రసంగిస్తున్న రక్షణ మంత్రి వరకూ వెళ్లింది.

అది తెలియగానే జార్జ్ ఫెర్నాండెజ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, దానిని ధ్రువీకరించుకునే ప్రయత్నం చేయలేదు. అప్పటికప్పుడే "టైగర్ హిల్‌ను భారత్ స్వాధీనం చేసుకుంది" అని ప్రకటించేశారు.

పాకిస్తాన్ ఎదురు దాడి

జనరల్ మొహిందర్ పురి.. కోర్ కమాండర్ జనరల్ కిషన్‌పాల్‌కు దాని గురించి సమాచారం ఇచ్చినపుడు ఆయన "ముందు వెళ్లండి, వెళ్లి షాంపేన్‌లో మునిగితేలండి" అన్నారు.

"కిషన్‌పాల్ సైన్యాధ్యక్షుడు జనరల్ మలిక్‌కు ఆ విషయం చెప్పారు. ఆయన నాకు ఫోన్ చేసి అభినందించారు" అని పురి తెలిపారు.

కానీ కథ ఇంకా ముగిసిపోలేదు. టైగర్ హిల్ శిఖరంపై స్థలం ఎంత తక్కువగా ఉంటుందంటే అక్కడ చాలా కొద్దిమంది జవాన్లు మాత్రమే ఉండగలరు.

పాకిస్తాన్ సైనికులు హఠాత్తుగా ఏటవాలు ప్రాంతంలోకి వచ్చి భారత జవాన్లపై కాల్పులు జరిపారు.

ఆ సమయంలో శిఖరంపై మబ్బులు కమ్మేసి ఉన్నాయి. భారత జవాన్లకు పాకిస్తాన్ సైనికులు కనిపించడం లేదు. ఆ కాల్పుల్లో శిఖరంపై ఉన్న భారత జవాన్లు చనిపోయారు.

టైగర్ హిల్

టైగర్ హిల్‌పై బాంబుల వర్షం

16,700 అడుగుల ఎత్తున్న టైగర్ హిల్‌ను ఆక్రమించేందుకు మేలో మొదట ప్రయత్నించారు. కానీ అప్పుడు వారు చాలా నష్టం రుచిచూడాల్సి వచ్చింది.

చుట్టుపక్కల శిఖరాలపై పట్టు సాధించేవరకూ టైగర్ హిల్ జోలికి వెళ్లకూడదని అప్పుడే అనుకున్నామని పురి అన్నారు.

జులై 3న దాడికి ముందు వందల భారత ఫిరంగులు ఒకేసారి టైగర్ హిల్‌పై బాంబుల వర్షం కురిపించాయి.

అంతకు ముందు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు 'పేవ్ వే లేజర్ గైడెడ్' బాంబులు వేసి పాకిస్తాన్ బంకర్లను ధ్వంసం చేశాయి.

ప్రపంచంలో అంతకు ముందెప్పుడూ ఇంత ఎత్తున ఇలా ఆయుధాలను ఉపయోగించలేదు.

టైగర్ హిల్

90 డిగ్రీలు నిట్టనిలువుగా ఎక్కాలి

టైగర్ హిల్ దగ్గరకు చేరుకున్న భారత జవాన్లు తూర్పు వాలు నుంచి పైకి ఎక్కాలనుకున్నారు. అది దాదాపు 90 డిగ్రీలు నిట్టనిలువుగా ఉంటుంది. దాన్ని ఎక్కడం దాదాపు అసాధ్యం.

కానీ పాకిస్తాన్ జవాన్లపై మెరుపుదాడి చేయాలంటే వారికి ఉన్న ఒకే ఒక దారి అదే.

భారత జవాన్లు రాత్రి 8 గంటలకు తమ బేస్ క్యాంప్ వదిలారు. ఆగకుండా ఎక్కుతూ తర్వాత రోజు ఉదయం 11 గంటలకు టైగర్ హిల్ శిఖరానికి చాలా దగ్గరికి చేరుకున్నారు.

చాలా చోట్ల పైకి ఎక్కడానికి వాళ్లు తాళ్ల సాయం తీసుకున్నారు. తుపాకులను బలంగా వీపుకు కట్టేసుకున్నారు.

అప్పటి పరిస్థితి గురించి సీనియర్ జర్నలిస్ట్ హరిందర్ బవేజా తన 'ఎ సోల్జర్స్ డైరీ-కార్గిల్ ద ఇన్‌సైడ్ స్టోరీ' పుస్తకంలో రాశారు.

"ఒక సమయంలో వాళ్లు పాకిస్తాన్ సైనికుల నిఘా నుంచి తప్పించుకోవడం అసాధ్యం అయ్యింది. అటువైపు నుంచి భీకర కాల్పులు జరుగుతుండడంతో వాళ్లు వెనక్కురాక తప్పలేదు. ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు" అని చెప్పారు.

తిరిగి కిందకు వెళ్తున్న భారత జవాన్లపై పాకిస్తాన్ సైనికులు భారీ బండరాళ్లు కూడా దొర్లించారు.

తెగించిన యోగేంద్ర సింగ్ యాదవ్

జులై 5న 18 గ్రెనేడియర్స్‌కు చెందిన 25 మంది సైనికులు మళ్లీ ముందుకెళ్లారు. పాకిస్తాన్ జవాన్లు వారిపై భీకర కాల్పులు జరిపారు. అక్కడ ఐదు గంటలపాటు ఏకధాటిగా కాల్పులు జరిగాయి.

దాంతో 18 మంది భారత జవాన్లు తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కు తిరిగారు. అప్పుడు అక్కడ ఏడుగురు భారత సైనికులే మిగిలారు.

'ద బ్రేవ్' పుస్తకాన్ని రాసిన రచనా విష్ట్ రావత్, అందులో.."భారత సైనికులు ప్రాణాలతో ఉన్నారా, లేదా చూడ్డానికి 11.30 సమయంలో దాదాపు 10 మంది పాకిస్తాన్ జవాన్లు కిందికి వచ్చారు. ప్రతి భారత జవాను దగ్గరా ఇక 45 రౌండ్ల బుల్లెట్లు మాత్రమే మిగిలున్నాయి. వారు పాక్ జవాన్లను తమకు దగ్గరగా రానిచ్చారు. వాళ్లు క్రీమ్ కలర్ పఠానీ సూట్ వేసుకుని ఉన్నారు. జవాన్లు దగ్గరికి రాగానే భారత సైనికులు ఫైరింగ్ ప్రారంభించారు" అని చెప్పారు.

అప్పుడు అక్కడున్న భారత జవాన్లలో బులంద్‌షహర్ వాసి 19 ఏళ్ల గ్రెనెడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ ఒకరు.

ఆరోజును గుర్తు చేసుకున్న యోగేంద్ర "మేం పాకిస్తాన్ సైనికులపై చాలా దగ్గర్నుంచి కాల్పులు జరిపాం. వారిలో 8 మందిని నేలకూల్చాం. కానీ వారిలో ఇద్దరు పారిపోయారు. పైకి వెళ్లి కింద ఏడుగురే ఉన్నారని మిగతా సైనికులకు చెప్పారు" అన్నారు.

శవాలపై కాల్పులు జరిపారు

"కాసేపట్లోనే 35 మంది పాకిస్తాన్ జవాన్లు అక్కడికి వచ్చేశారు. మమ్మల్ని అన్ని వైపుల నుంచీ చుట్టుముట్టారు. నాతో ఉన్న ఆరుగురూ చనిపోయారు. నేను భారత్, పాకిస్తాన్ సైనికుల శవాల మధ్య పడిపోయా. వాళ్లు భారత జవాన్లందరినీ కాల్చిచంపాలనుకున్నారు. అందుకే శవాలపై కూడా కాల్పులు జరుపుతున్నారు".

నేను అక్కడ కళ్లు మూసుకుని ప్రాణాలు పోయే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. నా కాళ్లూ చేతుల్లో, శరీరంలో చాలా చోట్ల సుమారు 15 బుల్లెట్లు తగిలాయి. కానీ నేనప్పటికీ బతికే ఉన్నాను.

ఆ తర్వాత జరిగింది, సినిమాలో వార్ సీన్ కంటే తక్కువేం లేదు.

"పాకిస్తాన్ సైనికులు మా ఆయుధాలన్నీ తీసుకున్నారు. కానీ వాళ్లు నా జేబులో ఉన్న గ్రెనేడ్‌ను గుర్తించలేదు. నేను నా బలమంతా కూడదీసుకుని ఆ గ్రెనేడ్ తీశాను. దాని పిన్ తీసి, ముందు వెళ్తున్న పాకిస్తాన్ సైనికులమీద విసిరాను".

"ఆ గ్రెనేడ్ ఒక పాకిస్తాన్ జవాన్ హెల్మెట్ మీద పడింది. అతడి తల ముక్కలైంది. నేను ఒక పాకిస్తాన్ జవాన్ శవం దగ్గరున్న పీకా రైఫిల్ అందుకుని ఫైరింగ్ ప్రారంభించాను. నా కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు చనిపోయారు" అని యోగేంద్ర చెప్పారు.

కొన ప్రాణాలతో కాలువలో దూకారు

యోగేంద్రకు అప్పుడే పాకిస్తాన్ వైర్లెస్ సెట్‌లో "అక్కడినుంచి వెనక్కు వచ్చేయండి, 500 మీటర్ల కిందున్న భారత్ ఎంఎంజీ బేస్‌పై దాడి చేయండి" అనే ఆదేశాలు వినిపించాయి.

యోగేంద్ర శరీరం నుంచి అప్పటికే చాలా రక్తం పోయింది, అతడు స్పృహలో ఉండడం కూడా కష్టంగా ఉంది. అక్కడ పక్కనుంచే ఒక కాలువ వెళ్తుండడంతో అతడు అదే స్థితిలో దాన్లో దూకేశాడు. ఆ ప్రవాహంలో ఐదు నిమిషాల్లో 400 మీటర్లు కిందికొచ్చాడు.

అక్కడున్న భారత సైనికులు అతడిని కాలువలోంచి బయటకు తీశారు. యాదవ్‌కు ఆప్పటికే చాలా రక్తం పోయింది. కళ్లు కూడా కనిపించడం లేదు.

కానీ సీఓ కుశహాల్ సింగ్ చౌహాన్ అతడితో "నువ్వు నన్ను గుర్తుపట్టగలవా" అని అడగ్గానే యోగేంద్ర కష్టంగా "సాహెబ్, నేను మీ గొంతు గుర్తుపట్టగలను, జైహింద్ సాహెబ్" అన్నారు.

పాకిస్తాన్ సైనికులు టైగర్ హిల్ ఖాళీ చేశారని కుశహాల్ సింగ్‌కు యోగేంద్ర చెప్పారు. ఇప్పుడు వాళ్లు మన ఎంఎంజీ బేస్‌పై దాడికి వస్తున్నారని చెప్పాడు. ఆ తర్వాత స్పృహతప్పింది.

కొంతసేపటి తర్వాత పాకిస్తాన్ సైనికులు ఆ బేస్‌పై దాడి చేసినపుడు భారత సైనికులు ముందే సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో యోగేంద్ర యాదవ్ చూపిన సాహసానికి భారత్ అతడికి భారత అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీరచక్రతో గౌరవించింది.

యోగేంద్ర సింగ్ యాదవ్

భారత సైన్యం ప్రతిష్టకే సవాలు

అక్కడ కింద రేడియో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. టైగర్ హిల్‌పై విజయం సాధించామనే ప్రకటన బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ వరకూ చేరింది.

దాంతో బ్రిగేడ్ అధికారులు వీలైనంత త్వరగా టైగర్ హిల్ శిఖరంపై భారత జెండాను ఎగరేయాలని నిర్ణయించారు. దానికోసం ఎంతకైనా తెగించాలని అనుకున్నారు.

అది ఇండియన్ ఆర్మీ ప్రతిష్టకే సవాలుగా మారింది. ఎందుకంటే టైగర్ హిల్ భారత్ చేతుల్లోకి వచ్చేసిందని అప్పటికే ప్రపంచమంతా వ్యాపించింది.

ఈలోపు 18 గ్రెనెడియర్స్ నుంచి ఒక కంపెనీ కాలర్ శిఖరంపైకి చేరుకుంది. దాంతో తమ ప్రాంతాన్ని రక్షించుకోడానికి పాకిస్తాన్ సైనికులందరూ చిన్న చిన్న భాగాలుగా విడిపోవాల్సి వచ్చింది.

ఆ క్షణం గురించి హరిందర్ బవేజా తన పుస్తకంలో రాశారు.

"భారత సైనికులు అదే అవకాశం కోసం వేచిచూస్తున్నారు. ఈసారి 23 ఏళ్ల కెప్టెన్ సచిన్ నింబాల్కర్ నేతృత్వంలో భారత జవాన్లు మూడోసారి దాడి చేశారు. అంత త్వరగా తిరిగి దాడి చేస్తారని పాక్ జవాన్లు అసలు ఊహించలేదు. నింబాల్కర్‌కు ఆ దారి గురించి పూర్తిగా తెలుసు. ఎందుకంటే అతడు అప్పటికే రెండుసార్లు పైకెళ్లి మళ్లీ కిందికి వచ్చాడు. అతడు జవాన్లతో చప్పుడు చేయకుండా టైగర్ హిల్ శిఖరంపైకి చేరాడు. నిమిషాల్లోనే టైగర్ హిల్ పైనున్న పాక్ సైనికుల 8 బంకర్లలో ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నారు"

"అక్కడున్న పాక్ సైనికులతో ఇప్పుడు ఎదురెదురుగా యుద్ధం మొదలైంది. ఇప్పుడు పాక్‌ ఎత్తులో లేకపోవడంతో వాళ్లకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. రాత్రి ఒకటిన్నరకు టైగర్ హిల్ శిఖరం భారత సైనికుల అధీనంలోకి వచ్చింది. కానీ టైగర్ హిల్ మిగతా భాగాలపై అప్పటికీ పాకిస్తాన్ సైనికులు పొంచి ఉన్నారు".

విజయానికి భారీ మూల్యం

అప్పుడే భారత జవాన్లకు కిందున్న తమ సైనికుల సంబరాల అరుపులు వినిపించాయి. బహుశా విజయం గురించి రేడియో సందేశం వారి వరకూ చేరిపోయింది.

ఇక మా రక్షణ మంత్రి ప్రపంచం ముందు తలవంచుకోవాల్సిన అవసరం లేదని వాళ్లందరిలో ఒక సంతోషం వచ్చింది.

భారత సైనికులు చాలా అలసిపోయి ఉన్నారు. లెఫ్టినెంట్ బల్వాన్ షాక్‌లో ఉన్నారు. వారు టైగర్ హిల్‌పై దాడి చేసిన సమయంలో ఆయనతో 20 మంది జవాన్లు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు.

మిగతా జవాన్లందరూ తీవ్రంగా గాయపడడమో, ప్రాణాలు కోల్పోవడమో జరిగింది. కొంతమంది సైనికులు అక్కడ పాకిస్తాన్ సైనికులు వదిలెళ్లిన ఆయుధాలను అంచనా వేయడం మొదలుపెట్టారు.

"అక్కడ ఉన్న ఆయుధాలు, మందుగుండు మొత్తం చూస్తుంటే సైనికులకు వణుకుపుట్టింది. టైగర్ హిల్‌పై ఆయుధాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బయటి నుంచి సాయం లేకుండా, పాకిస్తాన్ జవాన్లు వాటితో కొన్నివారాలపాటు యుద్ధం చేయొచ్చు. భారీ ఆయుధాలు, వెయ్యి కిలోల 'లైట్ ఇన్‌ఫాంట్రీ గన్' లాంటి వాటిని హెలికాప్టర్ లేకుండా అక్కడికి తీసుకురావడం అసాధ్యం".

పాకిస్తాన్ యుద్ధ ఖైదీ

టైగర్ హిల్‌పై దాడి చేయడానికి రెండు రోజుల ముందు భారత సైనికులు ఒక పాక్ జవానును సజీవంగా పట్టుకున్నారు. అతడి పేరు మహమ్మద్ అష్రఫ్. తను తీవ్రంగా గాయపడ్డాడు.

బ్రిగేడియర్ ఎంపీఎస్ బాజ్వా ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. "నేను జవాన్లతో అతడిని నా దగ్గరకు కిందికి పంపించమని, అతడితో మాట్లాడాలని చెప్పాను. అతడిని నా దగ్గరకు తీసుకొచ్చినపుడు నేను బ్రిగేడియర్ యూనిఫాంలో ఉన్నాను. నా ముందు అతడి కళ్లకు ఉన్న గంతలు విప్పారు. అతడు నన్ను చూడగానే ఏడవడం మొదలెట్టాడు" అన్నారు.

నేనది చూసి చాలా కంగారుపడ్డా. అతడితో పంజాబీలో "ఎందుకు ఏడుస్తున్నావ్" అన్నా. దానికి అతడు "నేను నా జీవితంలో ఎప్పుడూ కమాండర్‌ను చూళ్లేదు. పాకిస్తాన్‌లో వాళ్లెప్పుడూ మా దగ్గరికి రారు. మీరు ఇంత పెద్ద అధికారిగా ఉండి, నాతో నా భాషలో మాట్లాడడం చాలా గొప్ప విషయం. మీరు నన్ను ఇలా చూసుకోవడం, తినడానికి పెట్టడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు.

గౌరవంగా మృతదేహాల అప్పగింత

పర్వతాలపై యుద్ధం జరిగినపుడు ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బుల్లెట్ తగిలిన జవాన్లను పైనుంచి కిందికి తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది. వారికి అప్పటికే చాలా రక్తం పోతుంది.

"పాకిస్తాన్ సైన్యంలో కూడా చాలా మంది జవాన్లు చనిపోయారు. మేం భారత మౌల్వీలను పిలిపించి చనిపోయిన చాలా మంది పాక్ సైనికులను ఇస్లాం సంప్రదాయంలో ఖననం చేశాం" అని జనరల్ మొహిందర్ పురీ చెప్పారు.

"ఇవి మా సైనికులవి కాదు" అంటూ పాకిస్తాన్ మొదట్లో మృతదేహాలు తీసుకోడానికి నిరాకరించింది. కానీ తర్వాత వాటిని తీసుకోడానికి అధికారులు వచ్చారు.

బ్రిగేడియర్ బాజ్వా ఒక విషయం చెప్పారు.

"టైగర్ హిల్‌ను స్వాధీనం చేసుకున్న కొన్ని రోజులకు నాకు పాకిస్తాన్ నుంచి ఒక రేడియో మెసేజ్ వచ్చింది. ఆ వైపు నుంచి 'నేను సీఓ 188 ఎఫ్ఎఫ్ మాట్లాడుతున్నాను. మీరు మరణించిన మా సహచరుల మృతదేహాలను తిరిగివ్వాలని నా మనవి' అన్నారు".

"బదులుగా మీరు మాకోసం ఏం చేస్తారు" అని బ్రిగేడియర్ బాజ్వా ఆయన్ను అడిగారు. పాక్ అధికారి ఆయనతో "మేం తిరిగి వెళ్లిపోతాం, మమ్మల్ని పంపించడానికి మీకు దాడి చేయాల్సిన అవసరం రాదు" అన్నాడు.

"మేం యుద్ధరంగం మధ్యలో ఉన్న వారి మృతదేహాలను చాలా గౌరవంగా పాకిస్తాన్ జెండాల్లో చుట్టాం. మృతదేహాలు తీసుకెళ్లడానికి మీ స్ట్రెచర్స్ మీరే తీసుకురావాలని నేను వాళ్లకు చెప్పాను. వాళ్లు తీసుకొచ్చారు. మేం పూర్తి సైనిక లాంచనాలతో ఆ మృతదేహాలను వారికి అప్పగించాం. ఈ మొత్తం ఆపరేషన్‌ను చిత్రీకరించాం కూడా. దానిని మీరు ఇప్పటికీ యూట్యూబ్‌లో చూడొచ్చు" అని బాజ్వా ఆరోజును గుర్తు చేసుకున్నారు.

https://www.youtube.com/watch?time_continue=5&v=IS8cKBgNsOI

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kargil War: "I had 15 bullets in my body, I threw a grenade at Pakistan Army without losing my energy" - Yogendra Singh Yadav
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X