Karnataka Elections 2023 : మే 10న కర్నాటక ఎన్నికలు-13వ తేదీన ఫలితాలు: అమల్లోకి ఎన్నికల కోడ్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections 2023) షెడ్యూల్ విడుదలైంది. సీఈసీ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. మే 24తో కర్నాటక అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో కర్నాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్ధానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసిందని సీఈసీ వెల్లడించారు.
కర్నాటకలో ఈసారి ఓ విడతలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మే 10న ఎన్నికలు జరగబోతున్నట్లు తెలిపారు. మే 13న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు.
కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈసారి 58,282 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో 1320 పోలింగ్ స్టేషన్లు మహిళలకు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఈసారి 41,312 ట్రాన్స్ జెండర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నట్లు సీఈసీ తెలిపారు. ఈసారి 80 ఏళ్లకు పైగా వయసున్న ఓటర్లు 12.15 లక్షల మంది ఉన్నారన్నారు. అలాగే 16976 మంది ఓటర్లు 100 అంతకు పైగా వయస్సు ఉన్న వారు ఉన్నట్లు తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో తొలిసారి పలు మార్పులు చేపట్టబోతున్నట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 80 ఏళ్ల వయసు దాటిన వారికి, దివ్యాంగులకు తొలిసారి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కర్నాటక ఎన్నికల్లో ఉచితాలపై రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరికలు జారీ చేసింది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల రేసులో కాంగ్రెస్ అందరి కంటే ముందుగా అభ్యర్ధుల్ని ప్రకటించింది. మొత్తం 224 స్ధానాలకు గానూ 124 స్ధానాలకు తొలి విడతగా కాంగ్రెస్ అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఆ తర్వాత స్ధానంలో జేడీఎస్ 93 సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించింది. అధికార బీజేపీ మాత్రం ఏప్రిల్ తొలి వారంలో అభ్యర్ధుల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
2018లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 104 స్ధానాలు గెల్చుకుంది. అయితే 78 సీట్లు గెలిచిన కాంగ్రెస్, 37 సీట్లు గెలిచిన జేడీఎస్ జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగానే నిలిచింది. కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను చీల్చిన బీజేపీ.. కర్నాటకలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ.. గత మూడేళ్లలో పలు వివాదాస్పద నిర్ణయాలతో అధికారాన్ని సుస్ధిరం చేసుకునే పనిలో ఉంది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తంగా మారబోతున్నాయి.












Click it and Unblock the Notifications