గోబీ మంచూరియన్ అమ్మకాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
Karnataka: చిరు వ్యాపారులకు జీవనోపాధిని కల్పిస్తోన్న గోబీ మంచూరియన్ అమ్మకాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చూడగానే నోరూరించేలా కనిపించడానికి వాటి వంటకంలో రోడమైన్- బీ ఫుడ్ కలర్‌ను వినియోగించడాన్ని నిషేధించింది. ఇదే నిషేధం- కాటన్ క్యాండీ తయారీకీ వర్తింపజేసింది.
ఈ మేరకు కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఓ ప్రకటన చేశారు. బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గోబీ మంచూరియన్, కాటన్ క్యాండీ తయారీలో రోడమైన్- బీ ఫుడ్ కలరింగ్ వినియోగాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఎవ్వరైనా దీన్ని వినియోగిస్తోన్నట్లు తమ దృష్టికి వస్తే.. కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.

కాటన్ క్యాండీ అమ్మకాలను ఇటీవలే తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కూడా వాటి అమ్మకాలపై దృష్టి సారించింది. వాటి శాంపిళ్లను సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 171 కాటన్ క్యాండీ, గోబీ మంచూరియన్ శాంపిళ్లను తీసుకుంది.
లాబొరేటరీల్లో పరీక్షించగా.. అత్యంత ప్రమాదకరమైన పలు కృత్రిమ రంగులు, రోడమైన్- బీ వంటి ఫుడ్ కలరింగ్‌ను కాటన్ క్యాండీ, గోబీ మంచూరియన్ తయారీలో వినియోగిస్తోన్నట్లు తేలింది. టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో, కార్మోయిసైన్, రోడమైన్- బీ వంటి ఫుడ్ కలర్స్‌ను వాడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు.

వాటి వల్ల క్యాన్సర్ వంటి అత్యంత ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున వాటి వినియోగాన్ని నిషేధించినట్లు మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ఇతర ఆహార పదార్థాల్లో తగిన మోతాదులో టార్ట్రాజైన్ వినియోగించడానికి అనుమతి ఉన్నప్పటికీ.. గోబీ మంచూరియాలో మాత్రం దీన్ని వాడకూడదని స్పష్టం చేశారు.
ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై 10 లక్షల రూపాయల వరకు జరిమానా, ఏడు సంవత్సరాల కఠిన కారాగారశిక్షను విధించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దాని తీవ్రతను బట్టి ఒక్కోసారి ఈ రెండూ శిక్షలనూ ఒకేసారి అమలు చేయడానికీ చట్టాలు సహకరిస్తాయని అన్నారు.












Click it and Unblock the Notifications