ఛీ: రైల్వే అధికారుల ముసుగులో ఐటీ దాడులు, నీచ రాజకీయాలు, సీఎం ఫైర్, ప్రతిపక్షాలు!
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. గురువారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తారని ఒక్క రోజు ముందే ( బుధవారం) మీడియాకు చెప్పిన సీఎం కుమారస్వామి మరోసారి బాంబు పేల్చారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు మైసూరులోని సీఆర్ పీఎఫ్ క్వాటర్స్ లో రైల్వే అధికారుల ముసుగులో మకాం వేశారని, మండ్యలోని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలకు చెందిన బియ్యం గోదాముల్లో దాడులు చేసి అక్కడ స్పై కెమెరాలు ఏర్పాటు చేశారని శనివారం సీఎం కుమారస్వామి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు వారి విధులను దుర్వినియోగం చేస్తున్నారని సీఎం కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వ కార్యకర్తలను బెదిరించడానికి ఆదాయపన్ను శాఖ అధికారులు ఇలా చేస్తున్నారని సీఎం కుమారస్వామి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు, సూచనలు మేరకే ఆదాయపన్ను శాఖ అధికారులు ఇలా దాడులు చేస్తున్నారని, వెంటనే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని సీఎం కుమారస్వామి మనవి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నిజమైన సర్జికల్ స్టైక్ అంటే ప్రతిపక్షాల మీద ఐటీ దాడులు చేయించడమే అని సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఐటీ శాఖ అధికారి బాలకృష్ణ ఇలాంటి దాడులు చేసి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారని సీఎం కుమారస్వామి విమర్శించారు.












Click it and Unblock the Notifications