కర్ణాటక ప్రభుత్వాన్ని కాపాడండి, బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు, రాహుల్ గాంధీ ఆదేశాలు, ఎమ్మెల్యేలు!
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా చూసుకునే బాధ్యత మీదే అని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఆపరేషన్ కమలకు అవకాశం ఇస్తే మొదటికే మోసం వస్తుందని, ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే బాధ్యత మీదే అని సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ సూచించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాజీ సీఎం సిద్దరామయ్య భేటీ అయ్యారు.

సీఎం కుమారస్వామి వార్నింగ్
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని కుమారస్వామి చెప్పిన విషయం తెలిసిందే. మా ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పడం, కాంగ్రెస్ నాయకుల మీద జేడీఎస్ నాయకులు విరుచుకుపడటంతో సంకీర్ణ ప్రభుత్వంలో గొడవలు మొదలైనాయి.

ఏం జరిగింది ?
ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తానని బహిరంగంగా ఎందుకు చెప్పారు ? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు ? అంటూ సిద్దరామయ్య నుంచి రాహుల్ గాంధీ సమాచారం తెలుసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ సూచించారు.

లోక్ సభ సీట్లు ఎవరికి ?
2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో రాహుల్ గాంధీతో సిద్దరామయ్య, కేసీ. వేణుగోపాల్ చర్చించారు. తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని జేడీఎస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని, వెంటనే సీట్ల పంపిణి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీకి సిద్దరామయ్య, కేసీ. వేణుగోపాల్ మనవి చేశారు.

ఎమ్మెల్యేల అసంతృప్తి
సంకీర్ణ ప్రభుత్వంలో జేడీఎస్ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, మమ్మల్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని మాజీ సీఎం సిద్దరామయ్య రాహుల్ గాంధీకి చెప్పారు. జేడీఎస్ కు ఎక్కువ లోక్ సభ స్థానాలు కేటాయిస్తే తాము సహకరించమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారని తెలిసింది.