నన్నే ఆపుతావా? బ్లడీ రాస్కెల్..! మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి కోపం
బెంగళూరు : కర్ణాటకలో ఓ మంత్రి సహనం కోల్పోయారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది.
విధినిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అడ్డుకుంటావా అంటూ ఫైరయ్యారు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.

మంత్రి కోపం.. ఎస్పీ కన్నీరు
పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న సా.రా.మహేశ్, శివకుమార స్వామి అంత్యక్రియలకు హాజరు కావడానికి తుమకూరులోని మఠంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్పీ దివ్య ఆయన్ను ఆపాల్సి వచ్చింది. దీంతో మంత్రి కోపం తారాస్థాయికి చేరింది. నన్నే ఆపుతావా అంటూ మహిళ అని చూడకుండా నోటికి పని చెప్పారు. బ్లడీ రాస్కెల్ అంటూ తీవ్రంగా మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఎస్పీ.. కన్నీళ్లు రాల్చారు. అయితే వెంటనే తేరుకున్న మంత్రి.. విషయం పెద్దది చేయొద్దంటూ సూచించారట.
అస్త్రం దొరికింది..!
మంత్రి కోపాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంటోంది. జేడీఎస్ పార్టీకి చెందిన మంత్రి మహేశ్.. ఇలా చేయడం భావ్యం కాదంటూ సోషల్ మీడియాలో యుద్ధం మొదలుపెట్టింది. మహిళా ఆఫీసర్ అని చూడకుండా బ్లడీ రాస్కెల్ అంటూ సంబోధిస్తారా అని ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. తన పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా విధి నిర్వహణలో ఆమె పాల్గొన్నారని.. అంతలా అంకితభావమున్న అధికారులను అలాగే అవమానిస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 38 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి పగ్గాలు దక్కితే పరిస్థితి ఈవిధంగానే ఉంటుందని ఎద్దేవా చేసింది.

అవన్నీ కామనే..!
ఈ ఘటనపై సదరు ఎస్పీ దివ్య మాత్రం తానేమీ బాధపడలేదంటున్నారు. డ్యూటీలో భాగంగా అదంతా సాధారణమేనంటూ చెబుతున్నారు. శివకుమార స్వామి అంత్యక్రియల కోసం లక్షల మంది వచ్చారని.. ఆ క్రమంలో కొన్ని నిబంధనలు విధించాల్సి వచ్చిందని అంటున్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే తమ ప్రయత్నమని అన్నారు. ఆ సందర్భంలో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయని సర్ధిచెప్పుకున్నారు. వాస్తవానికి అక్కడ జరిగినటువంటి ఘటనలో బాధపడాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించారు. బందోబస్తులో భాగంగా నా డ్యూటీ నేను చేశానంటున్నారు.












Click it and Unblock the Notifications