karnataka polls : సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇవ్వబోతోందా ?
కర్నాటకలో మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. వీరిద్దరి పోరుతో మూడో పార్టీ జేడీఎస్ సైతం ఈసారి నామమాత్రంగా మారిపోతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి సొంతంగా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇందుకోసం ఎన్నికల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది.
కర్నాటక ఎన్నికల కోసం ఇప్పటికే 124 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ మరో 42 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఇందులో తొలి జాబితాలోనే మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీ చేసే నియోజకవర్గాల్ని కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు వరుణ సీటు కేటాయించింది. అయితే వరుణ కంటే కూడా కోలార్ లో ఈసారి పోటీ చేయాలని సిద్ధూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు షాక్ తప్పలేదు.

అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేటాయించిన వరుణతో పాటు కోలార్ సీటులోనూ పోటీ చేయాలని ఇప్పుడు సిద్ధరామయ్య భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఆయనకు కోలార్ సీటు కేటాయించేలా కనిపించడం లేదు. ఈసారి ఎన్నికల్లో ప్రతీ సీటు కూడా ప్రతిష్టాత్మకంగా మారడంతో సిద్ధరామయ్యను రెండు సీట్ల నుంచి పోటీచేయించరాదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలార్ సీటుకు రెండో జాబితాలోనూ అభ్యర్ధిని ప్రకటించలేదు.
ఈసారి ఎన్నికల్లో ప్రతీ సీటు ప్రత్యేకమని, అలాగే పార్టీ నేతలంతా తమకు సమానమే అన్న సంకేతాలు పంపేందుకే కాంగ్రెస్ సిద్ధరామయ్యకు రెండోసీటు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సిద్ధరామయ్య మాత్రం వరుణ కంటే తనకు కోలార్ లోనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. తాను తాజాగా చేయించుకున్న సర్వేలో కోలార్ సీటులో గెలుపు తథ్యమని తేలడంతో అక్కడ పోటీకి మొగ్గుచూపుతున్నారు.












Click it and Unblock the Notifications