మహిళలకు అన్నీ ఫ్రీ ఇస్తామని చెప్పండి- దెబ్బకు అధికారంలోకి వస్తారు: సిద్ధరామయ్య చిట్కా
బెంగళూరు: కిందటి నెలలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది కర్ణాటక. 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. 135 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటివరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 66 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)- 19, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.
ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది- కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో. ఇందులో పొందుపరిచిన అయిదు ఉచిత హామీలు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయనడంలో సందేహాలు అక్కర్లేదు. హామీలను ఇవ్వడానికే పరిమితం కాలేదు కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వాటి అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టింది.

జులై 1వ తేదీన గృహావసర వినియోగదారులకు 200 యూనట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి అమల్లోకి రానుంది. అన్నభాగ్య పథకం ఆగస్టులో ఇంప్లిమెంట్ కానుంది. మహిళలకు ప్రతినెలా 2,000 రూపాయల నగదు చెల్లింపు పథకం గృహ లక్ష్మిని అమలు చేయడానికి ముహూర్తం పెట్టింది. ఆగస్టు 15వ తేదీన యువనిధి పథకాన్ని ప్రవేశపెట్టనుంది సిద్ధరామయ్య సర్కార్.
కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్యను సన్మానించారు. పుణేలో ఆ సాయంత్రం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. సిద్ధరామయ్య సహా పలువురు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు దీనికి హాజరయ్యారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి సిద్ధరామయ్య మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్- ఎన్సీపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తాము అనుసరించిన వ్యూహాలను అమలు చేయాలని సిద్ధరామయ్య సూచించారు. కర్ణాటకలో తాము మహిళలకు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టామో.. అవే పథకాలను అమలు చేయాలని శరద్ పవార్, అజిత్ పవార్‌లను కోరుతున్నానని అన్నారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించకపోతే ఏ దేశం కూడా పురోగమించదని అహల్యా దేవి అభిప్రాయపడ్డారని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఆమె అభిప్రాయాలకు అనుగుణంగానే తాము కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. విద్యార్థినులు, వయోధిక వృద్ధులు అనే తేడా లేకుండా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications