వరుసగా 4వరోజు 20వేల కొత్త కేసులు -Keralaలో కొవిడ్ థర్డ్‌వేవ్ మొదలైనట్లేనా -బీజేపీకి భిన్నంగా రాహుల్ హెచ్చరిక
అన్ని విషయాల్లో ముందుండే కేరళ కరోనా మహమ్మారి విషయంలోనూ అదే తీరుగా ఉంది. దేశంలో కొవిడ్ థర్డ్‌వేవ్ కేరళ నుంచే ఆరంభమైందా అనే అనుమానాలను మరింత బలపరుస్తూ అక్కడ వరుసగా నాలుగో రోజు 20వేల పైచిలుకు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా పరిస్థితిపై పినరయి విజయన్ సర్కారును బీజేపీ నిందిస్తోంటే, కాంగ్రెస్ జాతీయ నేతలు మాత్రం లెఫ్ ను తిట్టకుండా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలివి..
కేరళ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 20,701 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,70,137కు చేరింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13.61శాతానికి చేరడం కలవరపెడుతున్నది.

నిన్న ఒక్కరోజే కేరళలో కొవిడ్ కాటుకు 116 మంది బలయ్యారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 16,701కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 14,651మంది బాధితులు కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 31,92,104కు చేరింది. ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,60,824గా ఉంది. ఇది దేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులు కావడం గమనార్హం. అత్యధికంగా (63 లక్షల) కేసులున్న మహారాష్ట్రలోనే 78వేల యాక్టివ్ కేసులుంటే, రెండో స్థానంలో ఉన్న కేరళలో యాక్టివ్ కేసులు రెట్టింపు ఉన్నాయి.
ఐసీఎంఆర్ చేసిన నేషనల్ సీరోసర్వేలో దేశంలో అత్యల్ప యాంటీబాడీలున్న రాష్ట్రంగా కేరళ(44 శాతం) నిలిచింది. అంటే రాష్ట్ర జనాభాలో 56 శాతం మందికి కోవిడ్ ముప్పుందని తేలుస్తోంది. కేరళ జనాభాలో 15 శాతం మంది 60 ఏళ్లు పైబడినవారు కావడం, డయాబెటిస్‌లాంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా ఎక్కువ ఉండటంతో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా మూడో వేవ్ కు కేరళే కేంద్రంగా నిలవొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా,
కేరళలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రజలను ట్విటర్ వేదికగా శుక్రవారం కోరారు. కేరళలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. తగిన రక్షణ చర్యలు, మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆంక్షలు సడలించడం వల్లే కేరళలో కరోనా పెరిగిందని బీజేపీ జాతీయ నేతలు సైతం పినరయి విజయన్ పై విమర్శలు చేస్తోంటే, రాహుల్ మాత్రం రాజకీయాల జోలికి పోలేదు.












Click it and Unblock the Notifications