సెకండ్‌వేవ్ ముగియలేదు: రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, కేరళలోనే 51శాతం యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: గత 24 గంటల దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంపై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఈ రెండు నెలలు అత్యంత కీలకమని స్పష్టం చేసింది.

పండగలున్నాయి.. జాగ్రత్తంటూ కేంద్రం
దేశ ప్రజలంతా తగిన జాగ్రత్తలతో పండగలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఇతర అధికారులు మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని, అందువల్ల వ్యాక్సినేషన్ తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని, కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.

దేశంలోని 51 శాతం యాక్టివ్ కేసులు కేరళలోనే..
కేరళలో కరోనా ఉధృతిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 58.4 శాతం ఒక్క కేరళలోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 3.33 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. వాటిలో లక్షన్నరకు పైగా(51శాతం) ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయని వెల్లడించారు. దేశంలో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్న ఏకైక రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం. గత 24 గంటల్లో 30వేలకుపైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.

ఏపీ సహా పది రాష్ట్రాల్లో 10వేల కన్నా ఎక్కువ యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష మధ్య ఉండగా, 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం 10వేల కన్నా తక్కువ ఉన్నట్లు వివరించారు. దేశంలోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు. దేశం కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. గత 24 గంటల్లో నమోదైన 46వేల కొత్త కేసుల్లో.. దాదాపు 58 శాతం కేరళలోనే వెలుగు చూసినట్లు వెల్లడించారు. మిగితా రాష్ట్రాల్లో మాత్రం కరోనా వ్యాప్తి తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళ రాష్ట్రంలోనే 1,70,829(51.19శాతం) ఉండటం గమనార్హం.

కేరళ తర్వాత ఈ రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు
ఇక మహారాష్ట్రలో 53,695(16.01శాతం), కర్ణాటకలో 19,344(5.8శాతం), తమిళనాడులో 18,352(5.5శాతం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో(4.21శాతం)గా ఉన్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జూన్ తొలి వారంలో 100కిపైగా కేసులు 279 జిల్లాల్లో నమోదుకాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 41 జిల్లాలకు చేరిందని తెలిపారు. రికవరీ రేటు కూడా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 97 శాతానికిపైగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా, అంతకుముందు రోజు కేరళలో 31,445 కరోనా కేసులు నమోదైనట్లు కేరళ వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,83,429కి చేరింది. కొత్తగా 215 మంది కరోనాతో మరణించడంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 19,972కి పెరిగింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా 19.03గా నమోదు కావడం గమనార్హం. ఇటీవల ఓనమ్ పండగ కారణంగానే కరోనా కేసులు పెరిగాయని భావిస్తున్నారు. ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 4048 కరోనా కేసులు నమోదయ్యాయి. త్రిస్సూర్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో మూడువేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూసినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.












Click it and Unblock the Notifications