కిరణ్ మౌనదీక్ష, బొత్స సపోర్ట్: దీక్షలో చిరు, పురంధేశ్వరి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్షను ప్రారంభించారు. ఆయన దీక్షకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి, పురంధేశ్వరి తదితరులు సంఘీభావం తెలిపి, దీక్షలో పాల్గొన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, నేతలు పలువురు ఈ దీక్షలో పాల్గొన్నారు.
సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావులు సంఘీభావం తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మంత్రి ఆనం వివేకానంద రెడ్డి నోటీకి నల్లటి గుడ్డను కట్టుకొని తన నిరసనను వ్యక్తం చేశారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును కేంద్రం పార్లమెంటులో ఎలా పెడుతుందని మంత్రి శైలజానాథ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

కిరణ్ దీక్షకు సీమాంధ్ర ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. కిరణ్ మౌన దీక్షకు మద్దతుగా సీమాంధ్రలోని పలు జిల్లాల్లో సమైక్యవాదులు దీక్షలు చేపట్టారు. కిరణ్ దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో.. బొత్స, కావూరి, చిరు, పురంధేశ్వరి, హర్ష కుమార్, లగడపాటి, రాయపాటి, మాగుంట, కెవిపి, సాయి ప్రతాప్, సుబ్బిరామి రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటించారు.
సీమాంధ్ర టిడిపి ఎంపీల అరెస్ట్
మరోవైపు సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు మెయిన్ గేటు వద్ద సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ ఆందోళనకు దిగారు. వారిని అరెస్టు చేశారు.
తెలంగాణపై షిండే
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం మాట్లాడుతూ.. తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్రమంత్రి వర్గ ఆమోదం లభించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశ పెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications