KKR vs GT : రింకూ సింగ్ ఐదు సిక్సర్లు కొట్టిన బ్యాట్ ఎవరిదో తెలుసా ? ఇక తనదే...
గుజరాత్ టైటాన్స్ తో నిన్న కోల్ కతాలో జరిగిన మ్యాచ్ పై నైట్ రైడర్స్ జట్టు ఆశలు వదిలేసుకున్న తరుణంలో చివరి ఓవర్లో అనూహ్యంగా ఐదు సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్ సంచలన విజయం అందించాడు. ఈ విజయంతో రింకూ సింగ్ పేరు దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో మార్మోగుతోంది. ఎవరీ రింకూ సింగ్ దగ్గరి నుంచి అతను ఆడిన బ్యాట్ ప్రత్యేకత ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్న రింకూ సింగ్ గతంలో చాలా కష్టాలు పడి పేదరికం నుంచి క్రికెట్లోకి వచ్చాడని తెలుస్తోంది. కోచింగ్ సెంటర్లలో క్లీనింగ్ వంటి పనులు కూడా చేసిన రింకూ సింగ్..క్రికెట్ అంటే ఇష్టంతో ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈ స్ధాయికి చేరినట్లు చెబుతున్నారు. అలాగే ఐపీఎల్ లో సెలక్షన్, తాజా ఇన్నింగ్స్ వరకూ అతని ప్రదర్శన మనం చూస్తూనే ఉన్నాం.

అయితే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో రింకూ సింగ్ ఐదు సిక్సర్లు కొట్టిన బ్యాట్ పైనా చర్చ జరుగుతోంది. ఈ బ్యాట్ లో అంత మహిమ ఉందా, అసలు దీని ప్రత్యేకత ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన రింకూ సింగ్.. ఈ బ్యాట్ ను తాను కెప్టెన్ నితీష్ రాణా నుంచి తీసుకున్నట్లు వెల్లడించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఉంచిన రాణా బ్యాట్ ను తీసుకుని ఈ ఐదు సిక్సర్లు కొట్టినట్లు తెలిపాడు. అయితే రింకూ ఫీట్ తర్వాత తన బ్యాట్ ను అతనికే ఇచ్చేయాలని నితీష్ రాణా నిర్ణయించడం విశేషం.












Click it and Unblock the Notifications