కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం కేసుతో మాజీ ప్రిన్సిపాల్ మెడకు బిగుస్తున్న ఉచ్చు!
కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆర్ జి కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడకు ఉచ్చు బిగిసుకుంటుంది. తాజాగా ఆయన పైన కోల్కతా పోలీసులు అవినీతి కేసును నమోదు చేశారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు జూన్ లో ఫిర్యాదు నమోదైనట్టు మీడియా కథనాలు వెల్లడించడంతో తాజాగా ఫోకస్ సందీప్ ఘోష్ పై పడింది.
వైద్యురాలి హత్యాచారం కేసులో మమత సర్కార్ అనూహ్య నిర్ణయం
జూన్ నుండి ఆర్జీ కార్ ఆస్పత్రి ఆర్ధిక అవకతవకలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని సమాచారం. కోల్కత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో ఒకవైపు కేసును సిబీఐ విచారిస్తుండగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా వైద్యురాలి అత్యాచార ఘటన నేపథ్యంలో ఆర్జీ కార్ ఆసుపత్రి పై వెల్లువెత్తుతున్న నిరసనలతో మమతా బెనర్జీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

ఆస్పత్రి ఆర్ధిక అవకతవకలపై సిట్ ఏర్పాటు
ఆర్ జి కార్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అవకతవకలపై సిట్ ను ఏర్పాటు చేసింది. 2021నుంచి జరిగిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. సిట్ బృందానికి అధిపతిగా ఐజి ప్రణవ్ కుమార్ ను నియమించింది. నెలలోగా తొలి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆర్జీ కార్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచారం నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసనలతో రాజీనామా చేసిన సందీప్ 2021లో ఆర్జి కార్ ప్రిన్సిపల్ గా పనిచేశారు.
ప్రిన్సిపాల్ పై కూడా సీబీఐ అనుమానం
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆయనను మూడు దఫాలుగా విచారణ చేసిన సిబిఐ సందీప్ ఘోష్ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వైద్యురాలి మరణం అనంతరం ప్రిన్సిపల్ ఎవరిని సంప్రదించారు? ఆమె తల్లిదండ్రులను మృతదేహాన్ని చూపించడానికి మూడు గంటల సేపు ఎందుకు ఆపారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు.
సందీప్ ఘోష్ మెడకు బిగుస్తున్న ఉచ్చు
ఆయన కాల్ రికార్డు తో పాటు వాట్సాప్ చాటింగ్ కూడా పరిశీలిస్తున్నారు సిబిఐ అధికారులు. ఇక మాజీ ప్రిన్సిపల్ సిబిఐ దర్యాప్తులో ఇస్తున్న సమాధానాలకు సిబిఐ సంతృప్తిగా లేనట్టు సమాచారం. మొత్తంగా కోల్కత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడకు ఉచ్చు బిగుస్తోంది.












Click it and Unblock the Notifications