Kolkata Rape-Murder: 42 మంది వైద్యుల బదిలీపై మమతా బెనర్జీ యూటర్న్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం ముగియక ముందే సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం భారీ స్థాయిలో డాక్టర్లను బదిలీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో పనిచేస్తున్న 42 మంది ప్రొఫెసర్లు, వైద్యులను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ సంగీతా పాల్, డాక్టర్ సుప్రియా దాస్ కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా, ఒకవైపు మహిళా డాక్టర్ హత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో మమతా బెనర్జీ ప్రభుత్వం వైద్యులను బదిలీ చేయడంపై డాక్టర్ల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. నిరసనకు మద్దతు ఇచ్చిన ఫ్యాకల్టీ సభ్యులను అన్యాయంగా బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్ పేర్కొంది.
తమ పోరాటంలో ఐక్యంగా, దృఢంగా నిలుస్తామని ట్వీట్ చేసింది యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్. డాక్టర్ల బదిలీలు ఒక కుట్ర అని, సీనియర్ వైద్య నిపుణులను 'భయపెట్టే' ప్రయత్నమని మమత సర్కారుపై మండిపడింది. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో గ్యాంగ్ రేపిస్టులను అణిచివేసేందుకు బదులుగా.. న్యాయం కోసం పోరాడుతున్న వారిని అణిచివేసేందుకు మమత ప్రభుత్వం నిమగ్నమై ఉందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా విమర్శించారు.
నిరసనలతో బదిలీలను రద్దు చేసిన మమతా బెనర్జీ
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన 42 మంది వైద్యుల బదిలీ ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. వైద్యుల బదిలీపై తనకు సమాచారం లేదని, అందుకు ఆ బదిలీలను రద్దు చేస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు.












Click it and Unblock the Notifications