లలిత్‌గేట్: 'సీఎం పదవికి రాజే రాజీనామా చేయాల్సిందే'
జైపూర్: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని విదేశాలకు పంపేందుకు సహకరించారనే ఆరోపణలతో రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై కాంగ్రెస్ తన విమర్శలను తీవ్రతరం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత సచిన్ పైలట్ లలిత్ మోడీ వ్యవహారంపై ప్రధాని మోడీ, వసుంధర రాజేలపై తీవ్ర విమర్శలు చేశారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లలిత్ మోడీ ఇమ్మిగ్రేషన్‌కు వసుంధరా రాజే సహకరించారని రుజువు చేసే పత్రాలు బయటకు రావడంతో ఆమె తక్షణమే రాజీనామా చేయాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు.
స్మార్ట్ సిటీలు, యోగా గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోడీ తన కేబినెట్‌లోని మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై పెదవి ఎందుకు విప్పటం లేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రాజస్ధాన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

లలిత్ మోడీ విషయంలో వసుంధరా రాజే ఎలాంటి తప్పు చేయలేదని సీఎంగా కొనసాగుతారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గురువారం రాజె కుటుంబానికి ఆప్త మిత్రుడు, క్యాబినెట్ మంత్రి రాజేంద్ర రాథోడ్‌తో రాజే భేటీ అయ్యారు.
మంత్రి రాజేంద్ర రాథోడ్ గురువారం సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీతో ముఖ్యమంత్రి పదవికి రాజే రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. లలిత్ మోడీ విదేశాలు వెళ్లేందుకు గాను రాజే సంతకంతో కూడిన రహస్య పత్రాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ బుధవారం విడుదల చేశారు.
2011, ఆగస్టు 18వ తేదీతో ఉన్న ఆ పత్రాల్లో 'ఇమిగ్రేషన్ కోసం లలిత్ మోడీ పెట్టుకున్న దరఖాస్తుకు మద్దతుగా ఈ స్టేట్‌మెంట్ ఇస్తున్నాను. అయితే నా ఈ సహాయాన్ని భారత అధికారులెవ్వరికీ వెల్లడించవద్దనే స్పష్టమైన షరతు మీద మాత్రమే' అని ఉంది.
ఇదంతా చూస్తుంటే, ముఖ్యమంత్రి పీఠం నుంచి వసుంధరా రాజే తప్పుకునే సూచనలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజే, కేంద్రంలో సుష్మా స్వరాజ్ పరిస్ధితి ఎన్టీఏ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కరంగా మారాయని ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications