పాక్ లో అనూహ్య ఘటన: ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ దాడి సూత్రధారి కాల్చివేత
భారత్ సాగించిన దాడులతో కుదేల్ అయింది పాకిస్తాన్. ఉగ్రవాదులకు ఆ దేశం ఆశ్రయం ఇస్తోందనే విషయాన్ని భారత్ ఇప్పటికే రుజువు చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన మారణహోమంలో పాకిస్తాన్ ప్రమేయం ఉందనే విషయాన్ని ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై సాక్ష్యాధారాలతో రుజువు చేసింది.
ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ లో మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో ఉగ్రవాదులు తిష్ట వేశారనడానికి మరో తాజా ఉదాహరణ ఇది. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టెర్రరిస్ట్ రజావుల్లా నిజామని ఖాలిద్ అలియాస్ అబు సైఫుల్లా ఖాలిద్ కాల్చివేతకు గురయ్యాడు.

గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లో ఈ సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అతని మరణాన్ని పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
2000 వరకు అతను నేపాల్ లో ఉగ్రవాద కార్యకలాపాలను యథేచ్ఛగా నిర్వహించాడు. లష్కరే తొయిబా నేపాల్ యూనిట్ కు చీఫ్ గా వ్యవహరించాడు. అక్కడ పోలీసులు, నిఘా పెరగడంతో భారత్ కు తరలివచ్చాడు. ఇక్కడ పలు దాడులకు పాల్పడ్డాడు. కొన్నింటికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు.
అబు సైఫుల్లా ఖాలిద్ కు భారత్ లో పలు ఉగ్రవాద దాడులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వాటన్నింటికీ అతనే మాస్టర్ మైండ్ కూడా. 2005లో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పై దాడి చేశాడు. ఆ ఘటనలో ఐఐటీ ప్రొఫెసర్ మునీష్ చంద్ర పురి మరణించారు. మరో అయిదుమంది తీవ్రంగా గాయపడ్డారు.
అక్కడితో అతని రక్తదాహానికి బ్రేకులు పడలేదు. ఆ మరుసటి ఏడాది అంటే- 2006లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంపై దాడికీ పాల్పడ్డాడు. అప్పటి ఘటనలో త్రుటిలో తప్పించుకున్నాడు ఖాలిద్. ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు, పోలీసులు కాల్చిచంపారు అప్పట్లో. .
2008లో ఉత్తర ప్రదేశ్ లోని రామ్ పూర్ లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్ పై ఉగ్రదాడి చేశాడు. ఈ ఘటనకు అతనే ప్రధాన సూత్రధారి. అప్పట్లో ఏడుమంది సీఆర్పీఎఫ్ జవాన్లు, ఓ సాధారణ పౌరుడు మరణించారు. ఆ తరువాత అతను పాకిస్తాన్ కు తరలివెళ్లాడు. సింధ్ ప్రావిన్స్ లో నివసిస్తోన్నాడు.
లష్కరే తొయిబా, జమాత్ ఉద్ దవా, జైషె మహ్మద్.. వంటి ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే వచ్చాడు. లష్కరే జమ్మూ కాశ్మీర్ యూనిట్ చీఫ్ యూసుఫ్ ముజామ్మిల్, ముజామ్మిల్ ఇక్బాల్ హష్మి, మహ్మద్ యూసుఫ్ తైబీ.. వంటి కరడుగట్టిన ఉగ్రవాదులతో కలిసి భారత్ పై దాడులకు కుట్రలు పన్నాడు.












Click it and Unblock the Notifications