లాక్‌డౌన్ 4.0 ఎలా ఉంటుంది? ఇక ప్రజా రవాణా వైపే మొగ్గు: మెట్రో రైళ్లూ రెడీ అవుతున్నాయ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న మూడోదశ లాక్‌డౌన్ ముగింపుదశకు వచ్చింది. ఆదివారం నాటితో 14 రోజుల మూడోదశ లాక్‌డౌన్ ముగుస్తుంది. ఇక నాలుగో దశ లాక్‌డౌన్ ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదివరకే స్పష్టం చేశారు. దేశంలో లాక్‌డౌన్ 4.0 అమలులోకి రావడం ఖాయమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.
Recommended Video

ప్రజా రవాణా వైపే
మూడోదశ తరహాలోనే లాక్‌డౌన్ 4లో అనేక సడలింపులను తీసుకుని రానుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని మోడీ సైతం తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇదివరకటి కంటే ఈ సారి లాక్‌డౌన్ స్వరూపం, స్వభావం పూర్తి భిన్నంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా- ఈ సారి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అంతర్ జిల్లాలు, అంతర్రాష్టాల మధ్య సైతం బస్సుల రాకపోకలకు అనుమతి ఇచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం.

వాటికి కొనసాగింపుగా మరిన్ని..
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి ఇప్పటికే ఎయిరిండియా విమానాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికుల కోసం కాకపోయినా.. పాక్షికంగా అది తన కార్యకలాపాలను ఆరంభించినట్టే. ఇక కమర్షియల్ ఆపరేషన్లను ఆరంభించడం ఒక్కటే మిగిలింది. దానికి కొనసాగింపుగా నాలుగోదశ లాక్‌డౌన్‌లో పూర్తిస్థాయిలో కాకపోయినా కమర్షియల్ సర్వీసులను పునరుద్ధరించవచ్చని అంటున్నారు. ఎయిరిండియాతో పాటు దేశీయంగా అన్ని విమానయాన సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాలు కూడా ఇప్పటికే రెడీ అయ్యాయి.

జోన్ల వారీగా రైళ్లు
మూడోెదశ లాక్‌డౌన్‌లో 15 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది సంబంధిత మంత్రిత్వ శాఖ. ఈ సారి వాటి సంఖ్యను పెంచడానికి కసరత్తు చేస్తోందని అంటున్నారు. నాలుగోదశ లాక్‌డౌన్ సందర్భంగా మరి కొన్ని ప్రధాన మార్గాల్లో రైళ్లను పట్టాలెక్కించవచ్చని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆయా జోన్లకు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది. జోన్ల వారీగా కొన్ని ప్రధాన మార్గాల్లో పరిమితంగా రైళ్లను నడిపించడానికి అవకాశం ఉంది.

మెట్రో రైళ్లూ రానున్నాయ్..
దేశ రాజధానిలో మెట్రో రైళ్లు కూడా పట్టాలెక్కవచ్చని తెలుస్తోంది. వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నప్పటికీ.. ఢిల్లీ మెట్రో సర్వీసులను పునరుద్ధరించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించేలా ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై బుధవరాం డీఎంఆర్‌సీ ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో ర్యాక్స్‌లల్లో సీటుకు సీటుకు మధ్య స్థలాన్ని వదులుతున్నారు. అలా వదిలేసిన సీట్లల్లో ఎవరూ కూర్చోకూడదంటూ స్టిక్కర్లను అతికిస్తున్నారు.

శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే
మెట్రో స్టేషన్లలో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ప్రయాణికుడి శరీర ఉష్ణోగ్రతను సిబ్బంది పరీక్షిస్తారు. సాధారణ స్థాయి కంటే అధికంగా వారిని వెనక్కి పంపించేస్తారు. దగ్గు, జలుబుతో బాధపడే ప్రయాణికులను కూడా మైట్రో రైళ్లల్లో ప్రయాణం చేయనివ్వబోమని ఆ ప్రకటనలో తెలిపారు. మాస్కులను ధరించడం తప్పనిసరి చేశారు. స్మార్ట్ ఫోన్లల్లో ఆరోగ్య సేతు యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎంట్రీ పాయింట్లలో శానిటైజర్లను అందుబాటులోకి తీసుకొస్తామని, వాటిని వినియోగించిన తరువాత లోనికి రానిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications