మకర జ్యోతి దర్శనం.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిమల
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం రోజున మంగళవారం సాయంత్రం మకరజ్యోతి రూపంలో అయ్యప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. దేశంలోని నలుమూలలతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతి దర్శించుకున్నారు.
అయ్యప్ప దర్శనం కోసం భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తిపారవశ్యులయ్యారు. దీంతో అయ్యప్పస్వామి నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. మరోవైపు, జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దేవతలు, రుషులు హారతిస్తారనే విశ్వాసం
కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల ప్రగాఢ విశ్వాసం. మకర సంక్రాంతి రోజున పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది.
మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెన్ కోర్ దవస్యం బోర్డ్ భారీగా ఏర్పాట్లు చేసింది. అయ్యప్పస్వాములు, భక్తులు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో స్వాములు, భక్తులంతా అయ్యప్పస్వామి మకర జ్యోతిని ప్రశాంతంగా దర్శించుకున్నారు. మరోవైపు, కోట్లాది మంది భక్తులు టీవీలు, ఇతర మాధ్యమాల్లో మకర జ్యోతిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications